అందని కార్పొరేట్ వైద్యం..ఆర్టీసీ డ్రైవర్ మృతి

అందని కార్పొరేట్ వైద్యం..ఆర్టీసీ డ్రైవర్ మృతి

ఇబ్రహీంపట్నం, వెలుగు: సమ్మె కారణంగా కార్పొరేట్​ హాస్పిటళ్లు ట్రీట్​మెంట్​చేసేందుకు నిరాకరిస్తుండడంతో ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. వికారాబాద్​ జిల్లా తాండూరు డిపోలో ఆర్టీసీ డ్రైవర్​గా విధులు నిర్వహించే కంబాలపల్లి జంగయ్య(41) మూడు నెలల క్రితం ఖమ్మం జిల్లాలో ఎదురెదురుగా బస్సులు ఢీ కొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కోమాలోకి వెళ్లడంతో నగరంలోని కార్పొరేట్​ హాస్పిటల్​లో చేర్పించారు. నెలరోజులకు కోలుకున్నాడు. నెల రోజులుగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి ఇంట్లో మంచంపైనే ట్రీట్​మెంట్​అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం జంగయ్య  ఆరోగ్యం క్షీణించడంతో ఆర్టీసీ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. గతంలో చికిత్స చేయించిన హాస్పిటల్​కు తీసుకెళ్లాలని అక్కడ సూచించారు. ఆ కార్పొరేట్ హాస్పిటల్​కు తరలించగా ట్రీట్​మెంట్​చేయడానికి నిరాకరించారు. గత్యంతరం లేక గాంధీ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం జంగయ్య మృతిచెందాడు. తొమ్మిదేళ్లుగా డ్రైవర్​గా చేస్తున్నాడని, కార్పొరేట్​హాస్పిటల్​లో చేర్చుకోకపోవడం వల్లే మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతుడికి భార్య స్వప్న, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.