హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీ తాగునీటి అవసరాల కోసం చేపట్టిన గోదావరి ఫేజ్–2, 3 ప్రాజెక్టు ప్యాకేజీ–1కు రూ.7,360 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం జీఓ నంబర్ 447 జారీ చేసింది. ఈ మేరకు ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. మూసీ సుందరీకరణ కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను గోదావరి నీటితో నింపే పథకానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హ్యామ్ మోడ్‌లో ఈ ప్రాజెక్టును అమలు చేయనుండగా, ఇందులో నిర్మాణ సంస్థ 60 శాతం, ప్రభుత్వం 40 శాతం వ్యయాన్ని భరిస్తుంది.
గోదావరి రెండో, మూడో దశల ద్వారా నగరానికి రోజుకు 320 ఎంజీడీల నీటిని తరలించనున్నారు. ఎల్లంపల్లి నుంచి శామీర్‌పేట వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఆరు నెలల క్రితమే ప్రారంభమయ్యాయి. సుమారు 4 కిలోమీటర్ల పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి. వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

