
- పట్టుబట్టి సాధించిన రాష్ట్ర సర్కారు
- గత ప్రభుత్వ హయాంలో 11శాతం వడ్డీకి అప్పులు
- తాజా రీ షెడ్యూల్‌తో వడ్డీరేటు 6 నుంచి 7 శాతానికి
- ఏటా రూ.2 వేల కోట్ల పైనే ఆదా అవుతాయని అంచనా
హైదరాబాద్, వెలుగు: అధిక వడ్డీలకు గత బీఆర్ఎస్ సర్కారు సేకరించిన రుణాలపై వడ్డీ చెల్లింపుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకుంటున్నది. బహిరంగ మార్కెట్‌లో తక్కువ వడ్డీలకు రుణాలను సేకరించి.. గతంలో అధిక వడ్డీలకు తీసుకున్నవాటిని పూర్తిగా తిరిగి కట్టేస్తున్నది. దీంతో వడ్డీ భారం దాదాపు 11 శాతం నుంచి 6 శాతం దాకా తగ్గుతున్నది. అధిక వడ్డీ నుంచి తక్కువ వడ్డీకి అప్పులు తగ్గించుకోవడంతో రాష్ట్రానికి ప్రతి ఏటా దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా ఆదా అవుతాయని సర్కారు భావిస్తున్నది.
రుణాలను రీషెడ్యూల్ చేయడంతో కేవలం వడ్డీ తగ్గడమే కాకుండా కిస్తీల చెల్లింపుల సమయం కూడా పెరగడంతో.. వాటి మొత్తం కూడా తగ్గుతుందని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఏడాదికి రూ.33 వేల కోట్లు కేవలం వడ్డీల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు వెనకా ఆలోచించకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్ భగీరథలాంటి వాటికి అధిక వడ్డీకి భారీగా అప్పులను తీసుకున్నది. ఆ ప్రాజెక్టులతో పంపిణీ చేసే నీటిపై పన్నులు వేసి.. అప్పులు చెల్లిస్తామని అప్పుడు పేర్కొన్నది. అయితే, కాళేశ్వరం మూడేండ్లకే కుంగిపోయింది. మరోవైపు మిషన్ భగీరథతో పన్నులు వేసే పరిస్థితి లేదు.
దీంతో ఈ అప్పుల కిస్తీలు, వడ్డీల భారం ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాల్సి వస్తున్నది. ఈ భారం తగ్గించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక వడ్డీ ఉన్న రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకునేందుకు రీషెడ్యూల్‌కు అనుమతించాలని ఏడాదిన్నర నుంచి కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ వస్తున్నది. ఎట్టకేలకు రూ.25 వేల కోట్ల రుణాల రీషెడ్యూల్‌కు అనుమతి లభించింది.
సాధారణంగా ప్రభుత్వం రూ.వేల కోట్లలో రుణాలు తీసుకుంటుంది. వాటిపై వడ్డీ ఒక శాతం తగ్గినా తిరిగి చెల్లించే భారం రూ.కోట్లలో ఆదా అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం తక్కువ వడ్డీలకు లభించే రుణాలను మాత్రమే సమీకరించాలనే కొత్త విధానాన్ని అమలు చేస్తున్నది. ఇంకా తక్కువ వడ్డీ చెల్లించే విధానంలో కొనుగోలుదారులు వీటిని కొనేందుకు ముందుకు వస్తే దీర్ఘకాలంలో ప్రభుత్వానికి వడ్డీ చెల్లింపుల భారం తగ్గుతుందని అంచనా.
భవిష్యత్తులో మరిన్ని రుణాల రీషెడ్యూల్
ప్రస్తుతానికి రూ.25 వేల కోట్ల రుణాల రీషెడ్యూల్‌కు అనుమతి లభించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.30 వేల కోట్ల రుణాల రీషెడ్యూల్ కోసం కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నది. దీంతో వడ్డీ భారం మరింత గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నది. ఇలా ప్రతి ఏటా కనీసం రూ.6 –7 వేల కోట్ల వడ్డీలు ఆదా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అలాగే, రాష్ట్ర విద్యుత్ రంగంలోనూ ఇదే పద్ధతిని అమలు చేయాలని యోచిస్తున్నది. కొత్త డిస్కమ్ ఏర్పాటు తర్వాత మిగిలిన రెండు డిస్కమ్‌ల రుణాలను కూడా రీషెడ్యూల్ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. అధిక వడ్డీలకు తీసుకున్న పాత రుణాలను తక్కువ వడ్డీలకు తీసుకున్న కొత్త రుణాలతో భర్తీ చేయడం ద్వారా ఆర్థిక పరిస్థితి దీర్ఘకాలంలో మెరుగుపడుతుందని, వడ్డీ చెల్లింపుల భారం గణనీయంగా తగ్గుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
ఆర్బీఐ నుంచి తక్కువ వడ్డీకి తీసుకొని చెల్లింపులు
రుణాల రీషెడ్యూల్‌లో భాగంగా వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటున్నది. వాటిని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) రుణాలకు తిరిగి చెల్లిస్తున్నది. గత ప్రభుత్వం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లాంటి భారీ ప్రాజెక్టుల కోసం పీఎఫ్‌సీ, ఆర్ఈసీల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నది. వీటిపై వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని రుణాలపై వడ్డీ రేటు ఏకంగా11.25% వరకు ఉంది. ఈ అధిక వడ్డీ రేట్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను భారాన్ని మోపుతున్నాయి.
అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఆర్బీఐ నుంచి రూ.5 వేల కోట్లు, అంతకుముందు మరో రూ.5 వేల కోట్లు చొప్పున ఏకకాలంలో రుణాలు తీసుకున్నది. వీటి వడ్డీ రేట్లు 6.5 శాతం లోపే ఉన్నాయి. వీటి చెల్లింపుల కాలపరిమితి కూడా 30 ఏండ్ల వరకు ఉంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు అంటే 2023 వరకు పదేండ్లలో పీఎఫ్‌సీ రూ.లక్షా10 వేల కోట్లు, ఆర్ఈసీ రూ.లక్షా 57 వేల 306 కోట్ల రుణాలను తెలంగాణకు ఆమోదించాయి. ఇందులో పీఎఫ్‌సీ రూ.91వేల కోట్లు, ఆర్ఈసీ రూ.లక్షా 37 వేల 606 కోట్లు ఇప్పటికే విడుదల చేశాయి. ఇందులో కొంత మొత్తం చెల్లింపులు కూడా పూర్తయ్యాయి.