హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, కుల సర్వే (ఎస్ఈఈఈపీసీ -2024) రిపోర్టు ఎట్టకేలకు వెల్లడైంది. రాష్ట్రంలోని 242 కులాల స్థితిగతులను నిశితంగా పరిశీలించిన నిపుణుల బృందం, దేశంలోనే తొలిసారిగా కాంపోసైట్బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్(సీబీఐ) అనే కొత్త కొలమానాన్ని తెచ్చింది.
సామాజిక వివక్ష, విద్య, ఉపాధి, ఆదాయం, భూమి వంటి 8 కీలక రంగాలకు చెందిన 42 అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ మార్కులను కేటాయించారు. ఈ సూచీలో స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే ఆ కులం అంతటి తీవ్రమైన వెనుకబాటుతనంలో మగ్గుతున్నట్లు లెక్క. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కులాల ఉమ్మడి సగటు సీబీఐ స్కోరు 81గా నమోదైంది. దీనికంటే ఎక్కువ స్కోరు ఉన్న 135 కులాల స్థితిగతులు దారుణంగా ఉన్నాయని రిపోర్టు స్పష్టం చేసింది.

