- సీఎం ‘విజన్’తో అమల్లోకి ‘ఎక్స్పోజర్ విజిట్’
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల టీచర్లు ప్రపంచ స్థాయి బోధనా పద్ధతులను అభ్యసించేందుకు సిద్ధమయ్యారు. విద్యా వ్యవస్థలో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన దేశంగా పేరుగాంచిన ఫిన్లాండ్ పర్యటనకు రాష్ట్రం నుంచి 40 మంది సభ్యులతో కూడిన తొలి బృందం శనివారం బయలుదేరనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ, స్వరాష్ట్రంలోనూ టీచర్లను విదేశీ పర్యటనలకు పంపడం ఇదే మొదటిసారి. సీఎం రేవంత్ రెడ్డి టీచర్స్ డే సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు విద్యా శాఖ ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాగా, టీమ్ లో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా, అందులో 34 మంది టీచర్లు/లెక్చరర్లు, ఆరుగురు విద్యా శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా నేతృత్వంలోని బృందం శనివారం వెళ్లనుంది.
5 రోజుల పాటు బిజీబిజీ
ఈ నెల 20 నుంచి 24 వరకు 5 రోజుల పాటు ఫిన్లాండ్ లోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ టర్కు, యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి సహకారంతో ఈ ట్రైనింగ్ కొనసాగనుంది. నూతన బోధనా పద్ధతులు, సిలబస్ రూపకల్పన, డిజిటల్ విద్య వినియోగంపై ఈ బృందం అవగాహన పెంచుకోనుంది. అక్కడి స్కూళ్లను సందర్శించి, క్లాస్ రూమ్ మేనేజ్ మెంట్, విద్యార్థులకు నేర్పించే ఆధునిక మెళకువలను పరిశీలిస్తారు. అక్కడి అనుభవాలను మన స్కూళ్లలో అమలు చేసి, విద్యా ప్రమాణాలను పెంచడమే ఈ పర్యటన లక్ష్యమని అధికారులు ప్రకటించారు. కాగా, ఫిన్లాండ్ పర్యటన తర్వాత మరికొన్ని బృందాలను జపాన్, సింగపూర్, వియత్నాం దేశాలకు పంపేందుకు విద్యా శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

