క్యూర్లో డబుల్ ఇండ్లకు సర్కారు డెడ్ లైన్..

క్యూర్లో డబుల్ ఇండ్లకు సర్కారు డెడ్ లైన్..
  • సెప్టెంబర్ 15 వరకు 23 వేల ఇండ్లు పూర్తి చేయాలని సర్కార్​ ఆదేశం​
  • కాంట్రాక్టర్లతో హౌసింగ్​ ఆఫీసర్ల​ మీటింగ్
  • బిల్లులు వెంటనే రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం రెడీ

హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న డబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 15 నాటికి 23 వేల ఇండ్ల నిర్మాణాలను  పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు డెడ్ లైన్ విధించింది. ఇటీవల హౌసింగ్​, జీహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న అధికారులు పనుల్లో వేగం పెంచాలని సూచించారు. " పనులు ఏ మేర పూర్తి చేస్తే ఆ మేర బిల్లులు చెల్లిస్తాం.

నిధుల కొరత లేకుండా చూసే బాధ్యత మాది. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయడం మీ బాధ్యత." అని కాంట్రాక్టర్లకు హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు ప్రభుత్వం ప్రతి సోమవారం గ్రీన్ చానల్ ద్వారా నిధులు విడుదల చేస్తోందని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సైతం నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇండ్ల నిర్మాణంతో పాటు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల వంటి మౌలిక వసతులను సైతం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏళ్ల తరబడి ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు దసరా కానుకగా ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఈ నియోజకవర్గాల్లో వేగంగా పనులు..

ప్రభుత్వం డెడ్ లైన్ విధించిన డబుల్ బెడ్ రూమ్​లు మొత్తం 23 వేలు ఉన్నాయి. ఇందులో నాంపల్లి నియోజకవర్గంలో 1824, సికింద్రాబాద్, చాంద్రాయణగుట్ట, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో 390, మహేశ్వరంలో 3500, ఇబ్రహీంపట్నంలో 3500, మేడ్చల్​లో 2700, కుత్బుల్లాపూర్​లో 3600,  పఠాన్ చెరు నియోజకవర్గంలో 4900 ఇండ్లు ఉన్నాయి.