టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో..జర్మనీతో తెలంగాణ కీలక ఒప్పందం

టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో..జర్మనీతో తెలంగాణ కీలక ఒప్పందం
  • సీఎం రేవంత్‌‌ రెడ్డితో జర్మనీ బృందం భేటీ 
  • భారత్, జర్మనీ సంబంధాల్లో తెలంగాణకు ప్రత్యేక స్థానం: 
  • జర్మనీ ప్రతినిధులు,  సెమీకండక్టర్ రంగంలో
  • పెట్టుబడులు పరిశీలిస్తామని వెల్లడి

టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వం, జర్మనీలోని తురింగియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. తురింగియా స్టేట్​ సీఎం మారియో వోయిట్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎం రేవంత్ రెడ్డితో ఎంసీహెచ్​ఆర్డీలోని బోధి పెవిలియన్​లో బుధవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వం, జర్మనీలోని తురింగియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. తురింగియా స్టేట్​సీఎం మారియో వోయిట్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్‌‌లో సీఎం రేవంత్ రెడ్డితో ఎంసీహెచ్​ఆర్డీలోని బోధి పెవిలియన్​లో బుధవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తురింగియా సీఎం మారియో వోయిట్ మాట్లాడుతూ.. భారత్​లో అభివృద్ధి, ఆవిష్కరణలకు తెలంగాణ ఒక కేంద్రబిందువుగా ఉందని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘తెలంగాణ రైజింగ్ -2047’ విజన్‌‌ను ఆయన అభినందించారు. భారత్​– జర్మనీ సంబంధాల్లో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని, ఆర్థికంగా వేగంగా వృద్ధి సాధిస్తున్న ఈ రాష్ట్రంతో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని వివరించారు. రెండు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరేలా కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన చెప్పారు.

ఉపాధి రంగంలో మార్పులు, నైపుణ్య శిక్షణ: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచవ్యాప్తంగా ఉపాధి రంగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఏఐ ప్రభావంతో సంప్రదాయ ఉద్యోగాల స్థానంలో కొత్త అవకాశాలు వస్తున్నాయని వివరించారు. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు అవసరమైన నైపుణ్యాలతో తెలంగాణ యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని.. అందుకోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీ సెంటర్లు, పాలిటెక్నిక్ కళాశాలల్లో బోధన విధానాలను మార్చేందుకు తురింగియా సహకారం కావాలని కోరారు. దీనిపై తురింగియా సీఎం మారియో వోయిట్ స్పందిస్తూ.. తెలంగాణ అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు రూపొందించేందుకు తమ పరిశ్రమలు, విద్యాసంస్థలు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ యువత ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను చాటుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో జర్మన్ భాషా పరిజ్ఞానం కూడా ఎంతో అవసరమని, హైదరాబాద్‌‌లో జర్మన్ భాషా శిక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంలో సహకరించాలని తురింగియా ప్రతినిధులను కోరారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్​ సిటీ’ గురించి కూడా సీఎం వివరించారు. ప్రపంచంలోని ఫార్చ్యూన్-500 కంపెనీలను ఆకర్షించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నామని, వ్యాపారాలకు అవసరమైన ప్రపంచ స్థాయి వసతులు హైదరాబాద్‌‌లో ఉన్నాయని చెప్పారు. 

పెట్టుబడులపై చర్చలు జరుపుతం: తురింగియా సీఎం మారియో 

సెమీకండక్టర్ రంగానికి చెందిన జర్మన్ కంపెనీల ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇక్కడి అవకాశాలను పరిశీలించి పెట్టుబడులపై చర్చలు జరుపుతామని తురింగియా సీఎం మారియో వోయిట్ తెలిపారు. ఈ ప్రతిపాదనను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతిస్తూ.. ఇప్పటికే హైదరాబాద్‌‌లో అనేక అంతర్జాతీయ సెమీకండక్టర్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, త్వరలోనే తయారీ రంగంలో కూడా తెలంగాణ ముందంజలో నిలుస్తుందని చెప్పారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌‌పవర్ కంపెనీ (టామ్‌‌కామ్) ద్వారా ఇప్పటికే జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమాలు సాగుతున్నాయని తెలిపారు. అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీ సెంటర్లలో యువతకు అత్యాధునిక నైపుణ్యాలు అందిస్తున్నామని, తురింగియా ప్రతినిధులు ఈ కార్యక్రమాలను ప్రత్యేకంగా వెళ్లి పరిశీలించవచ్చని సూచించారు. ఈ సమావేశంలో తురింగియా స్టేట్ సెక్రటరీలు టైచార్ట్, సకెర్ట్, జర్మన్ కాన్సుల్ జనరల్ హాస్పర్ సహా వివిధ రంగాలకు సంబంధించిన జర్మనీ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ శశాంక పాల్గొన్నారు.