వాట్సాప్ లో సర్కారు వైద్య సేవలు.. చాట్బాట్ ఆప్షన్ల ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్, ఇతర సేవలు

వాట్సాప్ లో  సర్కారు వైద్య సేవలు.. చాట్బాట్ ఆప్షన్ల ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్, ఇతర సేవలు
  • హెల్త్ రికార్డ్స్ తోపాటు ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ కార్డుల డౌన్​లోడింగ్​కు వెసులుబాటు 
  • డాక్టర్లు టైంకు రాకున్నా.. హాస్పిటల్ నిర్వహణ బాగలేకున్నా కంప్లైంట్ చేసే చాన్స్ 
  • తొలి విడతలో డీపీహెచ్, టీవీవీపీ పరిధిలోని వెయ్యి హాస్పిటల్స్ లో అమలు
  • ప్రత్యేక ఫోన్ నంబర్ ద్వారా సాఫ్ట్ వేర్​ రెడీ చేసిన ఆరోగ్యశ్రీ అధికారులు 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్తే.. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి. చాలా చోట్లా సూర్యోదయానికి ముందే వెళ్లి ఓపీ చిట్టీ కోసం పడిగాపులు కాయక తప్పదు. తీరా మన వంతు వచ్చే వరకు ఏ మధ్యాహ్నమో, సాయంత్రమో.. ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో విరివిగా వాడే వాట్సప్ ద్వారానే పలురకాల వైద్యసేవలు అందించేందుకు సిద్ధమైంది. వాట్సాప్ చాట్ బాట్ ద్వారా.. ఓపీ, హెల్త్ రికార్డ్స్, హెల్త్ కార్డుల డౌన్ లోడ్ వంటి సదుపాయాలను అతి త్వరలోనే అందుబాటులోకి తేనుంది. ప్రత్యేకంగా ఒక ఫోన్ నంబర్ ద్వారా డిజిటల్ సేవలను ప్రారంభించేందుకు రాష్ట్ర ఆరోగ్య శ్రీ అధికారులు సిద్ధమయ్యారు. 

ఈజీగా సేవలు, కంప్లైంట్లు..

ఈ డిజిటల్ సేవలు పూర్తిగా వాట్సాప్ చాట్ బాట్ ద్వారా నడుస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకురాబోయే నంబర్ కు మెసేజ్ చేయగానే.. తొలుత చాట్ బాట్ లో ఆయుష్మాన్‌ ​భారత్ ఐడీ, ఆధార్ నంబర్ తో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాలి. వెంటనే సర్వీసులకు సంబంధించి చాట్ బాక్స్ లో రకరకాల ఆప్షన్లు వస్తాయి. ఏ జిల్లా, ఏ హాస్పిటల్ లాంటి ఆప్షన్లను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా సర్వీసులు పొందొచ్చు. హాస్పిటల్ కు వెళ్లకముందే వాట్సప్ లో ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే, పేషంట్ల హెల్త్ రికార్డులు చూసుకోవడంతో పాటు, ఈహెచ్ఎస్ , జేహెచ్ఎస్ తదితర హెల్త్ కార్డులను డౌన్ లోడ్ చేసుకునే వెలుసుబాటు ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇవే కాకుండా హాస్పిటల్స్ లో ఇబ్బందులుంటే కంప్లైంట్ చేయడానికి, ఫీడ్ బ్యాక్ ఇవ్వడానికి కూడా ఇందులో ఆప్షన్లు ఉంటాయి. డాక్టర్లు టైంకు రాకున్నా, హాస్పిటల్ పరిసరాలు నీట్ గా లేకున్నా.. చాట్ బాట్ ద్వారా పేషెంట్లు తమ అభిప్రాయాలు చెప్పొచ్చని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 

తొలి విడత వెయ్యి హాస్పిటల్స్ లో..

ఈ వాట్సప్ సేవల కోసం ఆరోగ్యశ్రీ అధికారులు ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేశారు. అతి త్వరలోనే ఈ సేవలను పబ్లిక్ కు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని సుమారు వెయ్యి హాస్పిటల్స్ లో మొదటి విడతలో ఈ వాట్సప్ సేవలను  ప్రారంభించనున్నారు. పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, సీహెచ్ సీలు, టీవీవీపీ పరిధిలో మరికొన్ని హాస్పిటల్స్ లో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత ఫ్యూచర్ లో రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్సీల నుంచి మెడికల్ కాలేజీల దాకా.. ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఈ డిజిటల్ సేవలను అందుబాటులోకి తేనున్నారు.