- 2025- 26 ఆర్థిక సంవత్సరంలో ఫార్మా కన్నా ఎక్కువ ఎగుమతులు
- ఫార్మా వాటా 25 శాతం.. ఏరోస్పేస్ వాటా 33.4 శాతం
- 32,850 కోట్ల విలువైన ఏరోస్పేస్, డిఫెన్స్ ఉత్పత్తుల ఎక్స్‌పోర్ట్
- 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,940 కోట్లే..
- రెండేండ్లలోనే రెట్టింపు వృద్ధి
- 25 పెద్ద సంస్థలు.. వెయ్యికిపైగా ఎంఎస్ఎంఈల ద్వారా విడిభాగాల ప్రొడక్షన్
- అమెరికా, యూరప్ దేశాలకు ఇక్కడి నుంచే సరఫరా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం ఏరోస్పేస్ రంగంలో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నది. ఫార్మా క్యాపిటల్‌గా పిలుచుకునే రాష్ట్రం.. ఇప్పుడు ఏరోస్పేస్ రాజధానిగా రూపాంతరం చెందుతున్నది. అందుకు తగ్గట్టుగా రాష్ట్రంలో ఆ రంగానికి చెందిన ఎగుమతులు.. రెండేండ్లలోనే గణనీయంగా పెరిగాయి. ఔషధ ఉత్పత్తుల ఎగుమతులను దాటి.. ఏరోస్పేస్ ఎక్స్‌పోర్ట్స్ అధికంగా నమోదయ్యాయి. దాదాపు 5 దశాబ్దాలుగా రారాజుగా ఉన్న ఫార్మా ఎగుమతులు.. ఏరోస్పేస్ దెబ్బకు వెనకపడక తప్పలేదు. 2025–-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతుల్లో ఫార్మా వాటా 25 శాతంగా ఉంటే.. ఏరోస్పేస్, డిఫెన్స్ ఎగుమతులు 33.4 శాతం మేర నమోదయ్యాయి. తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లెక్కల్లో ఈ విషయం వెల్లడైంది. లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, సాఫ్రాన్‌లాంటి సంస్థల పెట్టుబడులతో రాష్ట్రం నుంచి ఏరోస్పేస్ ఉత్పత్తుల ఎగుమతి భారీగా పెరిగిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
రెండేండ్లలో రెట్టింపు..
ఏరోస్పేస్ రంగంలో ఎగుమతుల వృద్ధి రేటు రెండేండ్లలోనే రెట్టింపునకు మించి నమోదైంది. 2023-–24 ఆర్థిక సంవత్సరంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎగుమతులు కేవలం రూ.15,940 కోట్లు ఉండేవి. కానీ 2025–2026 ఆర్థిక సంవత్సరంలో ఆ విలువ ఏకంగా రూ.32,850 కోట్లకు పెరిగింది. అంటే డబుల్ కన్నా ఎక్కువ వృద్ధి నమోదైంది. ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాలు, డ్రోన్లు, మిసైళ్లు, అధునాతన డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఇక్కడి నుంచి ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఫ్యూజ్‌లాజ్ సెక్షన్లు, ఏవియానిక్స్‌సహా 2వేలకుపైగా విమాన విడిభాగాలు అమెరికా, బ్రిటన్‌లాంటి దేశాలకు మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన లాక్ హీడ్ మార్టిన్ ఉత్పత్తి కేంద్రం నుంచి ఎగుమతి అవుతుండడం విశేషం. సాఫ్రాన్ ఏర్పాటు చేసిన ఏరో ఇంజిన్ మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రంలో కూడా ఉత్పత్తి పెరుగుతున్నది. ప్రస్తుతం ప్రపంచంలోనే పెద్ద హబ్‌గా ఎదుగుతున్నది.
రాష్ట్రంలో ఇప్పటికే డిఫెన్స్ సెక్టార్‌కు చెందిన ప్రముఖ సంస్థలున్నాయి. డీఆర్డీవో, డీఆర్డీఎల్, బీడీఎల్, ఆర్సీఐ మిధాని, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలాంటి సంస్థల్లో రక్షణ రంగానికి చెందిన ఉత్పత్తులు తయారవుతున్నాయి. రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్ ఇప్పటికే వ్యూహాత్మక కేంద్రంగా ఉన్నది. ఇప్పుడు ఏవియేషన్ రంగంలోకూడా చెప్పుకోదగిన స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. శంషాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఎయిర్ పోర్ట్‌నూ మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నది. స్పేస్ రంగంలో స్కైరూట్‌లాంటి ప్రైవేట్ సంస్థ.. అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. పలు ఉపగ్రహ పరీక్షలను నిర్వహిస్తున్నది. దసో, బోయింగ్, లాక్ హీడ్ మార్టిన్‌లాంటి కంపెనీలూ రక్షణ రంగంలో వార్ క్రాఫ్ట్‌ల తయారీలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి.
దీంతో రాష్ట్రంలో ఈ రంగంలో 25కు పైగా పెద్ద సంస్థలు తమ ప్రొడక్ట్స్‌ను తయారు చేస్తున్నాయి. అంతే కాకుండా లోకల్‌గా వెయ్యికిపైగా ఎంఎస్ఎంఈలు ఈ రంగంలో విడిభాగాలను తయారు చేస్తున్నాయి. అదిబట్ల, కొత్తూరులలోని ఏరోస్పేస్ సెజ్‌లో 50కిపైగా ఏరోస్పేస్ ప్రొడక్షన్ పార్క్స్, దాంతోపాటు కొన్నేండ్లలో రెండు హార్డ్‌వేర్ పార్కులు ఏర్పాటయ్యాయి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, అదానీ ఏరోస్పేస్, మహీంద్రా ఏరోస్పేస్‌లాంటి సంస్థలు తమ యూనిట్లను నెలకొల్పాయి. దీంతో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి.. ఫలితంగా ఎక్స్‌పోర్ట్స్ కూడా పెరుగుతున్నాయి.
ఫార్మా ఎగుమతులు రూ.24 వేల కోట్లు
ఫార్మా ఇండస్ట్రీ ఎగుమతులు మొత్తం ఎగుమతుల్లో 25 శాతంగా ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. మొత్తం ఎక్స్‌పోర్ట్స్ దాదాపు 98 వేల కోట్లకుపైగా ఉండగా.. అందులో ఫార్మా ఎగుమతులు రూ.24 వేల కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఇంజినీరింగ్ ఎగుమతులు కూడా పెరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇండస్ట్రియల్ మెషినరీ, ప్రిసిషన్ కాంపోనెంట్స్, విద్యుత్ పరికరాల ఎక్స్‌పోర్ట్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ప్యూర్ జోన్‌లో రాబోయే కాలంలో ఆయా పరిశ్రమలు పెరిగి.. ఉత్పత్తి కూడా పెరుగుతుందని, ఎక్స్‌పోర్ట్స్ కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
