V6 News

ఈసారి 6.18 కోట్ల మొక్కలు!.. 2026 -27 వన మహోత్సవానికి సర్కారు టార్గెట్

ఈసారి 6.18 కోట్ల మొక్కలు!.. 2026 -27 వన మహోత్సవానికి సర్కారు టార్గెట్
  • మూడేళ్ల యాక్షన్ ప్లాన్ రెడీ 
  • 11 రకాల ప్లాంటేషన్లతో కార్యక్రమం
  • గ్రామీణాభివృద్ధి శాఖ డీఆర్​డీవోలకు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 6.18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే రాబోయే 2027, 2028 ప్లాంటింగ్ సీజన్లకు కూడా ముందుగానే యాక్షన్​ ప్లాన్​ సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారుల(డీఆర్‌‌‌‌‌‌‌‌డీవో)కు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. వనమహోత్సవం కార్యక్రమాలు పారదర్శకంగా సాగేందుకు ‘టీఎస్ సెక్యూర్’ లేదా ‘నారేగా’ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌లను అనుసంధానించారు.

క్షేత్రస్థాయిలో చేపట్టే ప్రతి పనిని సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌లోని టెంప్లేట్ల ఆధారంగా నమోదు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. ఎస్టిమేషన్ల తయారీలో టాస్కులు, నిర్ణీత ధరలను మార్చకూడదని నిబంధన విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూలీ రేట్లలో ఎలాంటి మార్పు లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.

వ్యక్తిగత పనులకు రూ.2 లక్షల పరిమితి..

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే వ్యక్తిగత లబ్ధిదారుల పనులకు గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే ఎస్టిమేట్ ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నాటిన మొక్కల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ‘వాచ్ అండ్ వార్డ్’ కింద ఒక్కో మొక్కకు నెలకు రూ.3 చొప్పున కేటాయించనున్నారు. వనమహోత్సవంలో భాగంగా మొత్తం 11 రకాల ప్లాంటేషన్లు చేపట్టనున్నారు.

లబ్ధిదారుల ప్లాంటేషన్లలో ఆయిల్ పామ్, మామిడి, బత్తాయి, నిమ్మ, సపోటా, కొబ్బరి, మునగ, మలబార్ వేప, మల్బరీ, ఈత వనాలు, యూకలిప్టస్ వంటి మొక్కలు నాటనున్నారు. సామాజిక వనాల కింద కమ్యూనిటీ ప్లాంటేషన్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాల ప్రాంగణాలు, రహదారుల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్లు, హరిత వనాలు అభివృద్ధి చేయనున్నారు.

చనిపోయిన స్థానంలో కొత్త మొక్కలు..

అన్ని జిల్లాల డీఆర్‌‌‌‌‌‌‌‌డీఓలు తమ పరిధిలో ప్లాంటింగ్ సైట్లను గుర్తించి సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌లో ఎస్టిమేషన్లు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమం అమలును పీఓలు, ఎంపీడీఓలు పర్యవేక్షిస్తారు. మొక్కల మనుగడపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నాటిన ఏడాదిలో 20 శాతం, నిర్వహణ కాలంలో 25 శాతం వరకు చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటేందుకు అవకాశం కల్పించారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, కందకాలు తీయడం, కంచె ఏర్పాటు, ఎరువుల సరఫరా వంటి ఖర్చులను కూడా ఎస్టిమేషన్లలో చేర్చారు. ఉద్యానవన పంటల సాగుకు ఎకరాకు నాటాల్సిన మొక్కల సంఖ్యను కూడా ఖరారు చేశారు. ఆయిల్ పామ్ ఎకరాకు 57, మామిడి 70, కొబ్బరి 40 నుంచి 110 వరకు, మునగ సాగుకు ఎకరాకు వెయ్యి మొక్కల వరకు అనుమతించారు.