- ప్రస్తుత సవాళ్లు, మార్పుల్ని అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ఎకో సిస్టం: శ్రీధర్‌బాబు
- ఆర్ అండ్ డీ, అడ్వాన్డ్స్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్టిఫికేషన్ అండ్ కాంప్లియెన్స్‌పై ప్రత్యేక దృష్టి
- ‘ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ జాతీయ సదస్సులో మంత్రి వ్యాఖ్యలు
హైదరాబాద్, వెలుగు: భవిష్యత్తు ఏరోస్పేస్ రంగ అవసరాలకు తగ్గట్టుగా తెలంగాణను దేశానికి ఒక వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నామని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఆర్ అండ్ డీ, అడ్వాన్డ్స్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్టిఫికేషన్ అండ్ కాంప్లియెన్స్.. ఈ మూడింటిని అనుసంధానించగలిగే దేశాలు, రాష్ట్రాలే రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ లో గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతాయన్నారు. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సవాళ్లు, మార్పుల్ని అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ఎకో సిస్టంను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
శుక్రవారం ‘ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ‘చేంజింగ్ సినారియో ఇన్ ఏరోస్పేస్ : ఆర్ అండ్ డీ, మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సర్టిఫికేషన్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఏరోస్పేస్ అంటే కేవలం యంత్రాల తయారీ మాత్రమే కాదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఒక దేశ వ్యూహాత్మక శక్తికి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఒకప్పుడు అమెరికా, రష్యా, ఐరోపా దేశాలే ఆధిపత్యం చెలాయించేవని, ఇప్పుడు వాటికి దీటుగా గ్లోబల్ సప్లై చైన్‌లో మన దేశం కూడా కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. యునెస్కో లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైంటిస్టులు, ఇంజినీర్లు మన దేశంలోనే ఉన్నారన్నారు. అయితే, ల్యాబుల్లో జరిగే పరిశోధనల్లో 30 శాతం కూడా కమర్షియల్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు నోచుకోవడం లేదని మెకిన్సే నివేదిక చెబుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరిశోధనల్ని ఉత్పత్తులుగా మార్చాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
42 వేల విమానాలు కావాలె
రాబోయే 20 ఏండ్లలో ప్రపంచవ్యాప్తంగా 42వేల కొత్త విమానాల అవసరం ఉంటుందని బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలు అంచనా వేశాయని శ్రీధర్ బాబు చెప్పారు. ఈ డిమాండ్‌ను హైదరాబాద్ అందిపుచ్చుకునేలా ఇప్పటికే ఇక్కడున్న ప్రిసిషన్ ఇంజినీరింగ్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ నెట్‌వర్క్, బలమైన ఎంఎస్ఎంఈ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ఇప్పటికీ మనం ఏరోస్పేస్ టెస్టింగ్, సర్టిఫికేషన్ కోసం విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తోందని చెప్పారు. ఫలితంగా ఖర్చు పెరగడమే కాకుండా.. ఉత్పత్తుల గ్రౌండింగ్‌కు 18 నెలల నుంచి 24 నెలల వరకు అదనపు సమయం పడుతున్నదన్నారు. ప్రపంచ స్థాయి సర్టిఫికేషన్ ఎకో సిస్టంను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని, ఆ దిశగా కేంద్రం చొరవ చూపాల్సిన అవసరముందని తెలిపారు.
డ్రోన్లు, రీయూజబుల్ రాకెట్లు, ఏఐ ఏవియానిక్స్, త్రీడీ ప్రింటింగ్, అడ్వాన్డ్స్ మెటీరియల్స్ తదితర అంశాలు రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ భవిష్యత్తును శాసిస్తాయని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పటినుంచే తెలంగాణను సిద్ధం చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న 1,500కు పైగా ఎంఎస్ఎంఈలు ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ దిగ్గజ సంస్థలకు విడిభాగాలను సరఫరా చేస్తూ ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయన్నారు. అనంతరం ఏరోస్పేస్ రంగంలో విశేష కృషి చేసిన పలువురు శాస్త్రవేత్తలు, ప్రముఖులను ఆయన ఘనంగా సత్కరించారు.

