- ఏజెంట్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు రవాణా శాఖ నిర్ణయం
- కార్డుల ప్రింటింగ్, పంపిణీకి కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ప్రతి వాహనదారుడికి ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీని నేరుగా హైదరాబాద్ నుంచే పంపించనున్నారు. ఏజెంట్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు, వాహనదారులు ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన బాధలు తప్పించేందుకు రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆర్టీఏ కార్యాలయాల ద్వారానే డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సరిటిఫికెట్లు(ఆర్సీ) ఇస్తున్నారు.
దీనివల్ల ఏజెంట్ల ప్రమేయం పెరిగి వారి చేయి తడిపితే తప్ప వాహనదారులకు కార్డులు అందడం లేదు. చాలా మంది వాహనదారులు డీఎల్, ఆర్సీ కార్డుల కోసం రోజుల తరబడి ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరిగాల్సి వస్తోంది. దరఖాస్తు చేసుకుని చాలా రోజులైనా కార్డులు రాకపోతే ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లి అడిగితే ‘మీ ఇంటికి పంపించాం’ అన్న సమాధానం వస్తుండటం, కార్డులు మిస్సయితే పోలీస్కంప్లైంట్ ఇచ్చి డూప్లికేట్ తీసుకోవడం రిస్క్ అని భావించిన చాలామంది ఏజెంట్లను ఆశ్రయించేవారు.
రెండు వారాల్లో వాహనదారుల ఇంటికి..
రాష్ట్రంలోని పలు ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసిన సందర్భంలో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ కుప్పలుగా పడి ఉండటం, కొన్నిసార్లు ఏజెంట్ల దగ్గర కార్డులు దొరకడం తెలిసిందే. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ డీజీ శిఖా గోయల్ ఉప్పల్ ఆర్టీఏ ఆఫీస్‌ను తనిఖీ చేయగా.. భారీ సంఖ్యలో కార్డులు లభ్యమయ్యాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆర్టీఏ అధికారులు ఆర్సీ, లైసెన్స్జారీ ప్రక్రియను సెంట్రలైజ్ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లో.. హైదరాబాద్ నుంచే రాష్ట్రంలోని వాహనదారుల ఇండ్లకు వాటిని పంపించనున్నారు. ఈ విధానం వల్ల రాష్ట్రంలో 60కి పైగా ఉన్న ఆర్టీఏ ఆఫీసుల్లో ఏజెంట్ల దందాకు చెక్ పడనుంది. రాష్ట్ర రవాణా శాఖ నుంచి ఏటా సగటున 5 లక్షల వరకు డ్రైవింగ్ లైసెన్స్,10 లక్షల వరకు ఆర్సీలు జారీ కానున్నాయి. కార్డుల ప్రింటింగ్, పంపిణీకి సంబంధించి టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది.

