జపాన్‌‌‌‌కు టామ్‌‌‌‌కామ్‌‌‌‌ విస్తరణ..జర్మనీ తరహాలోనే జపాన్‌‌‌‌తోనూ భాగస్వామ్యం:మంత్రి వివేక్ వెంకటస్వామి

జపాన్‌‌‌‌కు టామ్‌‌‌‌కామ్‌‌‌‌ విస్తరణ..జర్మనీ తరహాలోనే జపాన్‌‌‌‌తోనూ భాగస్వామ్యం:మంత్రి వివేక్ వెంకటస్వామి
  • జపాన్‌‌‌‌లో ఇంజనీర్లు, నర్సులు, బస్ డ్రైవర్లకు భారీ డిమాండ్
  • జపనీస్ భాష, పని సంస్కృతిపై మన యువతకు శిక్షణ
  • జపాన్ పర్యటన విశేషాలను మీడియాకు వెల్లడించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: జర్మనీలో విజయవంతంగా అమలవుతున్న తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌‌‌‌పవర్ కంపెనీ (టామ్‌‌‌‌కామ్) భాగస్వామ్య నమూనాను ఇకపై జపాన్‌‌‌‌కూ విస్తరిస్తున్నట్లు శక్తి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. జపాన్‌‌‌‌ పర్యటనలో తమను ఎంతగానో ఆకట్టుకున్న పరిశ్రమలు- యూనివర్సిటీల అనుసంధాన విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా హిరోషిమా ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ సంస్థాగత భాగస్వామ్యంపై చర్చలు జరిపినట్లు చెప్పారు.

ఈ మేరకు శనివారం సెక్రటేరియెట్‌‌‌‌లో జపాన్‌‌‌‌ పర్యటన విశేషాలను మీడియాతో మంత్రి పంచుకున్నారు. విద్యార్థుల ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్, అధ్యాపకులకు శిక్షణ (టీవోటీ), ఏఐ, రోబోటిక్స్, ఆటోమేషన్, అధునాతన తయారీ రంగాల్లో పరిశోధనలకు జపాన్ సంస్థలు పూర్తి ఆసక్తి కనబరిచాయన్నారు. జపాన్‌‌‌‌లో ఇంజనీర్లు, ఐటీఐ, పాలిటెక్నిక్ అభ్యర్థులు, నర్సులతో పాటు దాదాపు 10 వేల మంది బస్ డ్రైవర్లకు భారీ డిమాండ్ ఉందన్నారు. డ్రైవింగ్ మెళకువలతో పాటు జపనీస్ భాష, అక్కడి విశిష్ట పని సంస్కృతిపై మన యువతకు ముందే శిక్షణ ఇచ్చి ఈ అవకాశాలకు సంసిద్ధం చేస్తామని వివరించారు.

సమయపాలన.. కచ్చితత్వంపై ముందే అవగాహన

విదేశాలకు వెళ్లే యువతకు సాంకేతిక నైపుణ్యాలతో పాటు సమయపాలన, కచ్చితత్వం వంటి వర్క్‌‌‌‌ప్లేస్ డిసిప్లిన్‌‌‌‌పై ముందే అవగాహన కల్పిస్తామని మంత్రి వివేక్‌‌‌‌ చెప్పారు. ఉద్యోగాల పేరుతో యువతను నట్టేట ముంచే మోసపూరిత ‘ఫ్లై-బై-నైట్’ ప్రైవేట్ ఏజెన్సీలకు చెక్ పెట్టేందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలోని టామ్‌‌‌‌కామ్‌‌‌‌కు ఈ బడ్జెట్‌‌‌‌లో రూ.90 కోట్లు కేటాయించామని తెలిపారు. సెమీకండక్టర్లు, డిఫెన్స్ రంగాల అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత సిలబస్‌‌‌‌ను కొనసాగిస్తూనే, భవిష్యత్ ఉద్యోగాల కోసం సరికొత్త నైపుణ్యాల కరిక్యులమ్‌‌‌‌ను విద్యార్థుల ఐచ్ఛికంగా అందుబాటులోకి తెస్తున్నట్లు స్పష్టం చేశారు.

పీఎం సేతులో తెలంగాణకు నాలుగు క్లస్టర్లు..

కేంద్ర ప్రభుత్వ ‘పీఎం సేతు’ కార్యక్రమంలో భాగంగా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా తెలంగాణకు నాలుగు క్లస్టర్లు దక్కాయని మంత్రి వివేక్‌‌‌‌ తెలిపారు. ప్రైవేట్ రంగం నుంచి రూ.40 కోట్ల స్పాన్సర్‌‌‌‌షిప్‌‌‌‌తో పాటు కేంద్ర నిధులను జోడించి ఈ క్లస్టర్లను ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. వ్యవసాయం, ఆహార శుద్ధి రంగాల్లోనూ జపాన్ ఆధునిక పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. 

జపాన్‌‌‌‌లోని ప్రఖ్యాత సటాకే కార్పొరేషన్ పర్యటనలో భాగంగా వరి ఎండబెట్టడం, నిల్వ, ఆధునిక రైస్ మిల్లింగ్, సార్టింగ్ వంటి నూతన టెక్నాలజీలను పరిశీలించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీసీల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి- టెక్నాలజీపై స్థానిక యువతకు శిక్షణ ఇచ్చేలా కోర్సులను రూపొందిస్తున్నామని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, స్కిల్ వర్సిటీల ద్వారా యువతను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. మన పిల్లలు విదేశాల్లో ఉత్తమ నైపుణ్యాలు నేర్చుకుని, ఉన్నత ఉద్యోగాలు సాధించి తిరిగి తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి తోడ్పడాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి పేర్కొన్నారు.

పాలిటెక్నిక్‌‌‌‌లపై కమిటీ వేసినం.. 

పాలిటెక్నిక్ కాలేజీల భూములను ప్రభుత్వం విక్రయిస్తోందంటూ కొందరు చేస్తున్న ప్రచారాన్ని మంత్రి వివేక్‌‌‌‌ ఖండించారు. విద్యాసంస్థల ఆస్తులను అమ్మే ఆలోచన ప్రభుత్వానికి లేదని, కొత్త ఏటీసీల ఏర్పాటు కోసం ప్రభుత్వమే 250 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి ప్రభుత్వం కమిటీని వేసిందని, పాలిటెక్నిక్ అధ్యాపకులు, సిబ్బంది సర్వీస్ నిబంధనలు, ప్రమోషన్లు, ఉద్యోగ భద్రత విషయంలో మార్పులు ఉండబోవని హామీ ఇచ్చారు. 

రాష్ట్రంలోని ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌‌‌‌గ్రేడ్ చేశామని, వీటికి అదనంగా మరో 54 ఏటీసీలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. విద్యార్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.2,000 చొప్పున స్టైపెండ్ అందిస్తామని తెలిపారు.