హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలను మరింత విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఓవర్ లోడింగ్ రవాణా చేస్తున్న, త్రైమాసిక పన్నులు చెల్లించని, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
నిబంధనలు పాటించని వాహనాలపై తనిఖీలు చేపట్టి, అవసరమైతే వాటిని సీజ్ చేయాలని అధికారులకు సూచించారు. జూన్ 8 నుంచి ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మొబైల్ స్క్వాడ్ బృందాల పనితీరును ఈ సందర్భంగా సమీక్షించారు. స్లీపర్ బస్సుల్లో రక్షణ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, అదనపు రవాణా కమిషనర్ రమేశ్, జేటీసీలు పాల్గొన్నారు.
