ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ నుంచి బీసీ గురుకులాల్లో.. మరో 10 సీవోఈ కాలేజీలు ప్రారంభం

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ నుంచి బీసీ గురుకులాల్లో.. మరో 10 సీవోఈ కాలేజీలు ప్రారంభం
  • ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు.. టెన్త్ మార్కుల ఆధారంగానే మెరిట్ స్టూడెంట్స్ ఎంపిక
  • సీవోఈల్లో నీట్, ఐఐటీ, ఎప్‌‌సెట్ పోటీ పరీక్షలకు ఉచిత ప్రత్యేక కోచింగ్
  • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి చదువు.. గురుకులాల్లో సీవోఈ అడ్మిషన్లకు డిమాండ్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌‌ఈఐఎస్) పరిధిలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్‌‌లో గతేడాది 10 సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) కాలేజీలు ఏర్పాటు చేయగా, వచ్చే నెలలో మరో 10 కొత్త సీవోఈలను ప్రారంభిస్తున్నారు. సాధారణ గురుకుల పాఠశాలలు, కాలేజీల కంటే సీవోఈల్లో ఉత్తమ ఫ్యాకల్టీ, అధునాతన టీచింగ్, మెరుగైన మౌలిక వసతులు ఉండటంతో ఇక్కడ అడ్మిషన్లకు భారీ డిమాండ్ నెలకొంది. 

​ఒక్కో కాలేజీలో 160 సీట్లు.. ‘నీట్, ఐఐటీ’ల ప్రత్యేక కోచింగ్...

ప్రతి సీవోఈ కాలేజీలో ఫస్టియర్‌‌కు 80, సెకండియర్‌‌కు 80 చొప్పన మొత్తం 160 సీట్లు ఉన్నాయి. ఇంటర్మీడియట్ రెగ్యులర్ సిలబస్‌‌తో పాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్, ఐఐటీ-జేఈఈ మరియు రాష్ట్ర స్థాయి ఎప్‌‌సెట్ (ఈపీసెట్) పరీక్షలకు ఇక్కడ ప్రత్యేక కోచింగ్ అందిస్తారు. కార్పొరేట్ కాలేజీలకు దీటుగా డిజిటల్ క్లాస్‌‌రూమ్‌‌లు, ల్యాబ్‌‌లు, ఉచిత వసతి, పౌష్టికాహారంతో పాటు స్టడీ మెటీరియల్‌‌ను కూడా ప్రభుత్వం సమకూర్చనుంది.

 పరీక్ష లేదు.. పదో తరగతి మార్కులే ప్రామాణికం!

విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు బీసీ గురుకులాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్‌‌ను ప్రభుత్వం రద్దు చేసింది (ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో ఇంకా ఎంట్రన్స్ విధానమే కొనసాగుతోంది). పదో తరగతి చదువుతున్న సమయంలోనే ప్రిన్సిపాల్‌‌కు దరఖాస్తు చేసుకుంటే, యాన్యువల్ పరీక్షల్లో వచ్చిన మార్కులు లేదా జీపీఏ ఆధారంగా మెరిట్ విద్యార్థులను సీవోఈల్లో ప్రవేశాలకు ఎంపిక చేస్తున్నారు. మెరిట్ ఉన్న ప్రతి పేద విద్యార్థికి ఈ సువర్ణావకాశం దక్కేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.​ 

అన్ని కీలక ఎంట్రన్స్ లలో ఉత్తమ ఫలితాలు.. 

ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం  విడుదల చేసిన  ఈపీసెట్ 2026 లో ఎంజేపీ విద్యార్థులు గత ఏడాది కంటే ఉత్తమ ఫలితాలు సాధించారు. - అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో   ఐదు వేల లోపు ర్యాంక్  43 మంది విద్యార్థులు, పదివేల లోపు ర్యాంక్  122 మంది విద్యార్థులు,  1626 మంది  విద్యార్థులు  క్వాలిఫై అయ్యారు.

ఇంజనీరింగ్ లో 10వేల లోపు  56 మంది విద్యార్ధులు ర్యాంకులు సాధించారు. అగ్రికల్చర్ , ఫార్మసీ ఇంజినీరింగ్ విభాగంలో ఉన్నత విద్యా కోర్సుల కోసం నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకుల సొసైటీ నుంచి మొత్తం  3781 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ప్రైవేట్ కాలేజీలతో సమానంగా పోటీ పడుతూ బీసీ గురుకుల స్టూడెంట్స్ ర్యాంకులు సాధించారు.

నీట్, ఐఐటీ జేఈఈలో సైతం ప్రతి ఏటా ర్యాంకుల సంఖ్య పెరుగుతోంది.  ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక దృష్టి సారించింది.  నాణ్యమైన విద్యతో పాటు ఆన్ లైన్ కోచింగ్ ద్వారా విద్యార్థులకు అవసరమైన పోటీ పరీక్షల శిక్షణ  అందిస్తున్నామని సెక్రటరీ సైదులు చెబుతున్నారు.  సొంత , అద్దె భవనాల్లో ఉన్న వాటిని తొలిసారిగా మరమ్మతులు చేస్తూ మౌలిక వసతులను మెరుగు పరుస్తుంది. మరో వైపు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మిస్తోంది.

ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు ఖర్చు చేయలేని నిరుపేద తల్లిదండ్రులకు  కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కాలేజీలు కొండంత అండగా నిలవనున్నాయి. వచ్చే నెలలోనే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో, పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన బీసీ, ఇతర వర్గాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ గురుకుల సెక్రటరీ కోరుతున్నారు.

కొత్తగా 10 సీవోఈలు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాలు

మంచిర్యాల, లక్షింపేట ( అదిలాబాద్ )  సలోరా, ఆర్మూర్ ( నిజామాబాద్ )  గొల్లపల్లి, నారాయణరావుపేట ( మెదక్ )  ఎల్ ఎండీ ( కరీంనగర్ )  కమాలపూర్, గాంధీనగర్  ( వరంగల్ )  రఘనాద పాలెం, వైరా ( ఖమ్మం )  మునుగోడు, కనగల్ ( నల్గొండ )  కల్వకుర్తి ( మహబూబ్ నగర్ )  మేడ్చల్,  పెద్ద అంబర్ పేట ( రంగారెడ్డి ) ముషీరాబాద్, చాంద్రాయాణ్ గుట్ట ( హైదరాబాద్ ) .