
హైదరాబాద్, వెలుగు: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. జూన్ 13 వరకు 1,200 గ్రామాల్లో ఈ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఈ కార్యక్రమం శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను అర్థం చేసుకుని, పరిష్కారం చూపే అవకాశం కల్పిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది’ అని పేర్కొన్నారు.
రైతులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యవసాయ సంబంధిత అనుమానాలను శాస్త్రవేత్తల ద్వారా నివృత్తి చేసుకోవాలని కోరారు. కార్యక్రమ పర్యవేక్షణకు వ్యవసాయ శాఖ నుంచి నోడల్ అధికారులను నియమించామని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ ఆధ్వర్యంలో రూపొందిన ఈ కార్యక్రమంలో ఒక టీమ్‌లో నలుగురు చొప్పున మొత్తం 200 మంది శాస్త్రవేత్తలు 6 వారాల పాటు వారానికి ఒక గ్రామంలో పర్యటిస్తారని వివరించారు. ప్రతి బృందంలో ఇద్దరు శాస్త్రవేత్తలతో పాటు అగ్రికల్చర్ విద్యార్థులు, అగ్రి ఆఫీసర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభ్యుదయ రైతులు, స్కూల్ టీచర్లు, విద్యార్థులు భాగస్వామ్యం కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అగ్రికల్చర్ కాలేజీలు, పాలిటెక్నిక్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయ శాఖ సమన్వయంతో నిర్వహిస్తాయని వివరించారు.