- మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, తలసేమియా, సికిల్ సెల్ వంటి జన్యుపరమైన వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్త ప్రత్యేక స్క్రీనింగ్ చేపట్టనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ‘వరల్డ్ తలసేమియా డే’ సందర్భంగా ఐమ్యాక్స్ పక్కనున్న హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అవేర్నెస్ వాక్‌ను ఆయన ప్రారంభించారు. తలసేమియా అనేది అంటువ్యాధి కాదని, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యులోపమని మంత్రి వివరించారు. రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని, నిమ్స్‌లో ఇప్పటికే బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ‘హిమోగ్లోబినోపథీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మంలలో ఉన్న డే కేర్ సెంటర్లను త్వరలోనే ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలకు విస్తరిస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తలసేమియా సొసైటీ ప్రతినిధులు, బాధితుల కుటుంబ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
