- ఔట్ సోర్సింగ్ ద్వారా డ్రైవర్ల నియామకం చేపడుతాం
- ఆర్ అండ్ బీ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి భరోసా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రూ.13 వేల కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో, పనుల పర్యవేక్షణ కోసం ఫీల్డ్ ఇంజనీర్లకు త్వరలోనే ఎలక్ట్రికల్ వెహికిల్స్(ఈవీలు) అందజేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. ఈ వాహనాలకు ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా డ్రైవర్లను నియమిస్తామని చెప్పారు. శుక్రవారం సెక్రటరియేట్‌లో ఆర్ అండ్ బీ ఇంజనీర్స్అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
గడిచిన రెండున్నరేండ్లలో 463 మంది ఇంజనీర్లకు పదోన్నతులు కల్పించినందుకు వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు ఇంజనీర్ల సంక్షేమానికి సంబంధించిన పలు ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఇంజనీర్ల కోసం ప్రతిపాదించిన ఆడిటోరియం నిర్మాణానికి త్వరలోనే పరిపాలనా అనుమతులు మంజూరు చేసి, వారంలోనే టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. శ్రీను, ప్రధాన కార్యదర్శి రాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శరత్ బాబు, ట్రెజరర్ మహేందర్ కుమార్, ఎస్ఈలు పి. మోహన్, మాధవి, ఈఈలు తదితరులు పాల్గొన్నారు.
