అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్
  • రాష్ట్ర ప్రభుత్వ విప్ ల హర్షం
  • రాష్ట్రంలో 100 చోట్ల తెలంగాణ పబ్లిక్  స్కూళ్ల 

ఇబ్రహీంపట్నం, వెలుగు: తెలంగాణ విద్యావ్యవస్థలో రాబోయే విప్లవాత్మక మార్పులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక ప్రయోగశాల అని రాష్ట్ర ప్రభుత్వ విప్ లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను శుక్రవారం ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, చింతకుంట విజయరమణరావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, రామచందర్ నాయక్,  అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ సందర్శించారు.

ఆరుట్ల గ్రామానికి చేరుకున్న ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌లకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. గ్రామంలోని తెలంగాణ పబ్లిక్​స్కూల్​నిర్మాణం, సౌకర్యాలు, పనితీరు, ఇంటిగ్రేటెడ్ విద్యావ్యవస్థ, అధునాతన తరగతి గదులు, ఉచిత బస్సు సౌకర్యం, ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడామైదానం, జిమ్, భోజన సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులను రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఎమ్మెల్యే మల్ రెడ్డి వివరించారు.

కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేలా తెలంగాణ పబ్లిక్​స్కూల్​ఉందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 100 చోట్ల తెలంగాణ పబ్లిక్  స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఆరుట్ల పాఠశాలను నమూనాగా తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విద్యావిప్లవానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం ప్రజల అదృష్టమన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటైందన్నారు. విద్యావైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.