V6 News

ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ ఎగుమతుల్లో తెలంగాణ జోరు

ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ ఎగుమతుల్లో తెలంగాణ జోరు
  • 117.9 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే నంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌
  • రెండేళ్లలో నాలుగు రెట్లు పెరుగుదల
  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల ఉత్పత్తుల్లో దూకుడు
  • డీజీసీఐ అండ్​ ఎస్​ నివేదిక వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ ఎగుమతుల్లో దేశంలోనే తెలంగాణ  అత్యధిక వృద్ధిరేటును నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్‌‌‌‌‌‌‌‌ ఇంపోర్ట్‌‌‌‌‌‌‌‌, -ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ రికార్డ్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ ఇయర్లీ అనలిసిస్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ట్రేడ్‌‌‌‌‌‌‌‌ (నిర్యత్) పోర్టల్‌‌‌‌‌‌‌‌ విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ విషయం స్పష్టమైంది. 2023–-24 నుంచి 2024–25 మధ్య కాలంలో రాష్ట్రం 117.9 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రధానంగా విమాన విడిభాగాలు, రక్షణ రంగ పరికరాలు, పారిశ్రామిక యంత్రాల ఎగుమతులు వృద్ధికి కీలకంగా మారాయి.

గత రెండేళ్ల కాలంలో రాష్ట్రం నుంచి జరిగిన ఇంజినీరింగ్ ఎగుమతులను పరిశీలిస్తే అవి ఏకంగా నాలుగు రెట్లకు పైగా పెరగడం విశేషం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 1,827 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు, 2024-25 నాటికి 7,536 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ కాలంలో 103 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదైంది. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల సగటు వృద్ధి కేవలం 10 శాతం ఉండగా, తెలంగాణ దానికి మించి గణనీయమైన ముందంజ వేసింది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి జరిగే మొత్తం వస్తువుల ఎగుమతుల్లో ఇంజినీరింగ్ ఉత్పత్తుల వాటా 38.44 శాతానికి చేరుకుంది. ఈ పురోగతిలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ (డీజీసీఐ అండ్​ఎస్​) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 

అంతర్జాతీయ సంస్థల కేంద్రాలు ఏర్పాటు

హైదరాబాద్ వేదికగా లాక్‌‌‌‌‌‌‌‌హీడ్ మార్టిన్, బోయింగ్, ఎయిర్‌‌‌‌‌‌‌‌బస్, సఫ్రాన్, జీఈ ఏవియేషన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ కీలక గ్లోబల్ హబ్‌‌‌‌‌‌‌‌గా మారింది. దీంతో గతేడాది ఇంజినీరింగ్ ఎగుమతుల్లో 8వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. ఒక్క ఏడాదిలోనే 4వ స్థానానికి ఎగబాకింది. మరోవైపు, పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల కల్పన, భూముల లభ్యత వంటి అంశాలు రానున్న రోజుల్లో తెలంగాణ వృద్ధికి మరింత దోహదపడనున్నాయి.