- నెలవారీ కోటాలో జాప్యం చేయవద్దు.. కేంద్రానికి మంత్రి తుమ్మల లెటర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి యూరియా సరఫరాలో నెలకొన్న సందిగ్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లెటర్ రాశారు. ఏప్రిల్, మే కేటాయింపుల్లో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏప్రిల్కు మొత్తం 2 లక్షల టన్నుల యూరియా కేటాయించగా అందులో 1.33 లక్షల టన్నులు దేశీయ ఉత్పత్తి నుంచి, 67 వేల టన్నులు దిగుమతుల ద్వారా రావాల్సి ఉందని వివరించారు. ఇప్పటివరకు కేవలం 67 వేల టన్నులు మాత్రమే వచ్చిందన్నారు.
రాష్ట్రానికి ఈ సీజన్‌లో దాదాపు 11.50 లక్షల టన్నులు యూరియా అవసరం ఉంటుందని అంచనా వేయగా జులై–ఆగస్టులో వినియోగం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని పేర్కొన్నారు. ఆర్ఎఫ్సీఎల్ నుంచి 95 వేల టన్నుల యూరియాను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఎరువులు సకాలంలో అందించేందుకు యూరియా బుకింగ్ యాప్‌ను ప్రవేశపెట్టి ముందుగానే బుక్ చేసుకునే సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. దీంతో క్యూ లైన్లు తగ్గడంతో పాటు పారదర్శకత పెరిగి బ్లాక్ మార్కెట్ నియంత్రణ సాధ్యమైందన్నారు. యాసంగిలో 11 మంది డీలర్ల లైసెన్సులు రద్దు చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అదనంగా జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేసి పర్యవేక్షణను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. మే 4 నుంచి 9 వరకు ఎరువుల వినియోగంపై ప్రత్యేక ప్రచారం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

