మిస్​ వరల్డ్​ ఫ్యాషన్​ షోలో చేనేత సోయగం

మిస్​ వరల్డ్​ ఫ్యాషన్​ షోలో చేనేత సోయగం
  • మిస్ వరల్డ్ ఫ్యాషన్ ఫినాలేలో తళుక్కుమన్న తెలంగాణ డిజైన్లు 
  • పోచంపల్లి, గద్వాల, గొల్లభామ చీరలతో అందాల భామల ర్యాంప్ వాక్ 
  • ఆసియా-ఓషియానియా విభాగంలో మిస్ ఇండియా నందిని గుప్తా విజయం

హైదరాబాద్, వెలుగు: మిస్ వరల్డ్ వేదికపై మరోసారి తెలంగాణ సంసృతీ సంప్రదాయాలు తళుక్కున మెరిశాయి. శనివారం హైదరాబాద్‌లోని హోటల్ ట్రైడెంట్‌లో జరిగిన వరల్డ్ ఫ్యాషన్ ఫినాలేలో చేనేత చీరలు ధరించి అందాల భామలు సందడి చేశారు. పోచంపల్లి, గద్వాల, గొల్లభామ చీరలు కట్టుకుని ర్యాంపు వాక్ చేశారు. వందకు పైగా దేశాల అందగత్తెలు చీరెకట్టులో ఆకట్టుకున్నారు. అమెరికా, కరీబియన్ దేశాల భామలు చేనేత వస్త్రాలతో ర్యాంప్ వాక్ చేయడం షోలో హైలెట్‌గా నిలిచింది. యూరప్ ఖండానికి చెందిన కంటెస్టెంట్లు గొల్లభామ చీరల్లో మెరిశారు. ఇక మిస్ ఇండియా నందిని గుప్తా ఎరుపు రంగు పటోలా లెహంగాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ చేనేత వస్త్రాలతో డిజైన్లు చేయడం ఆనందంగా, గర్వంగా ఉందని డిజైనర్ అర్చనా కొచ్చార్​పేర్కొన్నారు. దీని ద్వారా చేనేత చీరలకు ప్రపంచ ఖ్యాతి దక్కుతుందన్నారు. కాగా, ఈ షోకు హాజరైన న్యాయ నిర్ణేతలు, ఆహూతులు తెలంగాణ సంప్రదాయ డిజైన్లపై ప్రశంసలు కురిపించారు. స్థానిక చేనేత ఉత్పత్తులను ఇలా అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడంతో ఆ డిజైన్లకు, తయారీదారులకు మంచి గుర్తింపు, మార్కెటింగ్ అవకాశాన్ని ఇస్తుందన్నారు. 

నలుగురు విజేతలు.. 

వరల్డ్ ఫ్యాషన్ ఫినాలేలో నాలుగు ఖండాల నుంచి నాలుగు దేశాలకు చెందిన ముద్దుగుమ్మలను (టాప్​ మోడల్​) విజేతలుగా ప్రకటించారు. అమెరికా–కరీబియన్ నుంచి మార్టినిక్‌కు చెందిన ఔరెలీ జోకిమ్, ఆఫ్రికా ఖండం నుంచి నమీబియాకు చెందిన సెల్మా కమన్య, యూరప్ నుంచి ఐర్లాండ్‌కు చెందిన జాస్మిన్ గెర్హార్ట్, ఆసియా–-ఓషియానియా నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా విజయం సాధించారు. వీళ్లు నలుగురు ఈ నెల 31న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే గ్రాండ్ ఫినాలేలో తలపడనున్నారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీ మాట్లాడుతూ.. టాప్ మోడల్ పోటీ అందం గురించి మాత్రమే కాదన్నారు. ఇది ఆత్మవిశ్వాసం, సంస్కృతిని చాటి చెప్తుందన్నారు. ఈ వేదిక ద్వారా నందిని గుప్తా ఇండియా గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిందన్నారు.