రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చించింది యునెస్కో. కాకతీయ రుద్రేశ్వర ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. కాకతీయుల నాటి శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న చారిత్రక కట్టడం రామప్ప.  

కాకతీయల కళా నైపుణ్యానికి నిదర్శనం పాలంపేటలోని రామప్ప దేవాలయం. 800 ఏళ్ల సంస్కృతీ, సంప్రదాయాలకు దర్పణం పడుతూ తెలంగాణ ప్రాంత చారిత్రక కీర్తిని ప్రపంచానికి చాటిచెబుతోన్న అద్భుత ఆలయం. ఆలయంపై కనువిందుచేసే శిల్ప సౌందర్య రాశులు, సప్త స్వరాలు పలికే స్తంభాలు,  చూపరులను ఆకట్టుకునే నంది విగ్రహం, పరవశింపజేసే ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది రామప్ప ఆలయం. 

రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా కృషి చేస్తోంది. గత జూన్ 23 న రాష్ట్రానికి చెందిన నేతలు, మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర సాంస్కృతిక , పర్యాటకశాఖ మంత్రిని కలిశారు. రామప్పకు ప్రవంచ వారసత్వ హోదా వచ్చేలా కృషి చేయాలని కోరారు. దీంతో కేంద్ర ప్రభుత్వం  రామప్ప దేవాలయంతోపాటు గుజరాత్ లోని సింధు నాగరికత నాటి వట్టణమైన ధోలవీరను యూనెస్కో ప్రవంచ వారసత్వ ప్రదేశాల జాబితాకు నామినేట్ చేసింది.