న్యూఢిల్లీ: హిందూ మతం అనేది ఒక జీవన విధానమని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక వ్యక్తి హిందువుగా కొనసాగడానికి తప్పనిసరిగా ఆలయానికి వెళ్లాలని, పూజలు చేయాలనే నియమం ఏమీ లేదని వెల్లడించింది. ఇంట్లో దీపం వెలిగించినా హిందూ మతాన్ని విశ్వసించినట్లేనని పేర్కొంది.శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం, మత స్వేచ్ఛ వంటి అంశాలపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరపు న్యాయవాది డాక్టర్ జి. మోహన్ గోపాల్ వాదిస్తూ..మతపరమైన వర్గాల నుంచి సామాజిక న్యాయం కోసం డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. " హిందువు అని పిలవడానికి వేదాలను ప్రామాణికంగా అంగీకరించాలనే నిబంధన వర్తించదు. హిందూ మతంలో ఉన్న ప్రతి వ్యక్తి వేదాలను ఆధ్యాత్మిక, తాత్విక పరంగా సుప్రీం పవర్‌గా అంగీకరిస్తున్నారని చెప్పలేం. కాబట్టి, కేవలం వేదాలను అంగీకరించే వారే హిందువులనే పాత నిర్వచనం నేటి వాస్తవ పరిస్థితులకు సరిపోదు" అని పేర్కొన్నారు.
ఈ వాదనపై కోర్టు స్పందిస్తూ.. "అందుకే హిందూ మతాన్ని ఒక జీవన విధానం (వే ఆఫ్ లైఫ్) అని పిలుస్తారు. ఒకరు హిందువుగా ఉండటానికి తప్పనిసరిగా గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆచారాలను పాటించాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి తన ఇంట్లో, లేదా గుడిసెలో దీపం వెలిగించినా, అది అతని మత విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి సరిపోతుంది" అని పేర్కొంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలే, జస్టిస్ ఆర్. మహదేవన్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చీ సభ్యులుగా ఉన్నారు.
