చెత్త ఎత్తుడు.. చెట్లు పెట్టుడు! పల్లె ప్రగతిలో పది రోజుల షెడ్యూల్

చెత్త ఎత్తుడు.. చెట్లు పెట్టుడు! పల్లె ప్రగతిలో పది రోజుల షెడ్యూల్
  • చెత్త ఎత్తుడు.. చెట్లు పెట్టుడు!
  • నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి
  • పదిరోజుల పాటు జిల్లా ఆఫీసర్లంతా ఫీల్డ్‌లోనే..
  • క్లీన్ అండ్ గ్రీన్‌కే తొలి ప్రాధాన్యం 
  • సెగ్రిగేషన్ షడ్లు, శ్మశానవాటికలు కంప్లీట్ చేయాలని టార్గెట్
  • పనుల పర్యవేక్షణకు మండలానికో స్పెషల్ ఆఫీసర్

నల్గొండ, వెలుగు: నేటి నుంచి పదిరోజుల పాటు జిల్లా ఆఫీసర్లు,  వివిధ శాఖల ఉద్యోగులెవరూ ఆఫీసుల్లో దొరకరు. వాళ్లంతా గురువారం నుంచి ప్రారంభం కానున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో బిజీ కానున్నారు. గడిచిన మూడు విడతల్లో చేపట్టిన కార్యక్రమాలే నాలుగో విడతలోనూ యథాతథంగా అమలు చేయనున్నారు. క్లీన్​అండ్​గ్రీన్​కింద ఎప్పట్లాగే వీధుల్లో  చెత్త ఎత్తడం, మొక్కలు నాటడం చేపట్టనున్నారు. ఇవిగాక రోడ్లకు ఇరువైపులా ఉన్న కంపచెట్లను తొలగించడం,  మురుగు కాల్వల్లో పూడిక తీయడం,  తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయడం, దోమల నివారణకు ఫాగింగ్, పనికిరాని బావులు, బోర్లు పూడ్చివేయడం, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, కరెంట్​వైర్లు సరిచేయడం లాంటి పనులు చేపట్టాలని గైడ్​లైన్స్​లో పేర్కొన్నారు.

కొత్తగా రెండు టాస్క్​లు
పల్లె ప్రగతి నాలుగో విడతలో  కొత్తగా రెండు టాస్కులు చేర్చారు. ఇప్పటికే స్టేట్​వైడ్​ 97శాతం డంప్​యార్డులు,  92శాతం శ్మశానవాటికలు పూర్తికాగా, మిగిలినవాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడం మొదటి టాస్క్​. గ్రామాల్లో ఖాళీ జాగ కనిపించకుండా మొక్కలు నాటడం రెండో టాస్క్​. ఈ రెండు టాస్క్​లను ఉన్నతాధికారులు సీరియస్​గా తీసుకొని సర్పంచులు, సెక్రెటరీలను ఉరుకులు పెట్టిస్తున్నారు. ఎప్పటిలాగే హోం షెడ్ ప్లాంటేషన్​లో భాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయడంతో పాటు, రోడ్ల వెంట ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా మొక్కలు నాటుతామని చెబుతున్నారు. మరుసటి ఏడాది మొక్కలు నాటేందుకు ఎక్కడా ఖాళీ జాగా ఉండద్దని ఆఫీసర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పంచాయతీ సెక్రటరీ ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేసి రిజిస్టర్లో ఎంటర్ చేయాలి. ఇక ఈసారి గ్రామ కమిటీల్లో సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కార్యదర్శులతో పాటు, కొత్తగా విద్యుత్ లైన్​మెన్లకు చోటు కల్పించారు. 

జిల్లా ఆఫీసర్లు ఊర్ల  తిరుగుడే..
పల్లె ప్రగతి ప్రోగ్రాంను మానిటరింగ్ చేసేందుకు జిల్లా స్థాయి అధికారులను మండలానికి ఒకరి చొప్పున స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు.   గురువారం నుంచి పది రోజులపాటు జిల్లా ఆఫీసర్లు ఊర్లలో తిరగాల్సిందే. మూడు విడతల్లో పల్లె ప్రగతిలో సాధించిన అభివృద్ధి గురించి తొలిరోజు గ్రామసభలో ప్రజలకు వివరించాలి.  ఎంపీడీవోలు, ఎంపీవోలతో పాటు, జిల్లా ఆఫీసర్లు ప్రతి రోజు ఏదో ఒక గ్రామాన్ని తప్పనిసరిగా విజిట్ చేయాలి. ఆయా గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం ఏ విధంగా అమలవుతుందో దానికి సంబంధించిన తనిఖీ రిపోర్ట్​ను ఏరోజు కారోజు జిల్లా కలెక్టర్లకు మెయిల్ చేయాలి. ఆఫీసర్లకు అలాట్ చేసిన మొబైల్ నంబర్లతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్​లు కూడా క్రియేట్ చేశారు. ఈ గ్రూపుల్లో ప్రోగాం వివరాలు ఎప్పటికప్పుడు మేసేజ్ చేయాలి.

పది రోజుల షెడ్యూల్​ ఇలా.. 
మొదటి రోజు: పల్లె ప్రగతి కార్యక్రమానికి సంబంధించి గ్రామ సభ నిర్వహించాలి. గ్రామ కమిటీ సభ్యులు అందరూ ఈ మీటింగ్​కు అటెండ్ కావాలి. గ్రామ సభ అనంతరం పాదయాత్ర చేపట్టాలి. ముఖ్యంగా దళిత వాడల్లో తిరగాలి.
రెండో రోజు(పవర్​డే): లూజ్​గా ఉన్న కరెంట్ తీగలను, వంగిన స్తంభాలను, దెబ్బతిన్న కేబుల్ వైర్లను సరిచేయాలి.
మూడో రోజు: పాడుబడిన  బోరు బావులు, పాత బావులను పూడ్చేయాలి. లోతట్టు నిల్వ ప్రాంతాలను గుర్తించి, మొరంతో సరిచేయాలి.
నాలుగో రోజు: ఆదివారం గ్రామస్తులతో శ్రమదానం చేయించాలి. ఇంటింటికి వెళ్లి ఆరు మొక్కలు పంపిణీ చేయాలి. మొక్కలను అందజేసి ఇంటి యజమానితో మొక్కలు ముట్టినట్లు రిజిస్టర్లో సంతకం తీసుకోవాలి. అలాగే ప్లాస్టిక్​వ్యర్థాలను తొలగించాలి.
ఐదు, ఆరో రోజులు: మిషన్ భగీరథ పైప్​లైన్ల లీకేజీలను సరిచేయాలి. మురికి కాల్వలు శుభ్రంచేయాలి. గ్రామ పంచాయతీ తీర్మానంతో అవసరమైనచోట అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సైడ్ డ్రైన్స్ నిర్మాణాలకు ప్రపోజల్స్​ రెడీ చేయాలి. కమ్యూనిటీ సోక్ పిట్స్​తో పాటు ప్రతి ఇంట్లో సోక్ పిట్స్ నిర్మాణాలకు ప్రపోజల్స్​రెడీ చేయాలి. 
ఏడు, ఎనిమిది రోజులు(గ్రీన్ డే): గ్రామాల్లో నర్సరీలను విజిట్ చేయాలి. ఖాళీ జాగల్లో మొక్కలు నాటాలి. శ్మశానవాటికలు, రైతువేదికల చుట్టూ మొక్కలతో  గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. అంతర్గత రహదారులు, సరిహద్దు ప్రాంతాల్లో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలి.
తొమ్మిదో రోజు(డ్రై డే): ఓహెచ్ఎస్ఆర్​ట్యాంకులు శుభ్రం చేసి, క్లోరినేషన్ చేపట్టాలి. ప్రభుత్వ బిల్డింగ్స్​ను శుభ్రం చేయాలి. దోమల నివారణకు ఫాగింగ్ చేయించాలి. మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయాలి. ఆశావర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లతో కలిసి గ్రామాల్లో సీజనల్ వ్యాధులు గుర్తించాలి. 
పదో రోజు: లే అవుట్స్​కు సంబంధించి క్రమబద్ధీకరించిన లే అవుట్లలో 10 శాతం గిఫ్ట్ డీడ్ చేయించుకోవాలి. అక్రమ లే అవుట్స్​కు సంబంధించి చర్యలు తీసుకోవాలి. ఈ పదిరోజుల పాటు ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. కనీసం రెండు రోజులు దళిత వాడల్లో క్లీన్​అండ్​గ్రీన్​ నిర్వహించాలి.