V6 News

కౌలు రైతులకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలి

కౌలు రైతులకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలి
  • గుర్తింపు కార్డులు జారీ చేయాలి
  • ప్రజా సంఘాల నేతల డిమాండ్
  • రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

హైదరాబాద్ సిటీ/హైదరాబాద్, వెలుగు: కౌలు రైతులకు కాంగ్రెస్  పార్టీ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని,  2011 చట్టం అమలుచేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని వివిధ ప్రజా సంఘాల నేతలు డిమాండ్  చేశారు. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, నాయకులు, మేధావులు హైదరాబాద్  బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కోదండరాం, పౌరహక్కుల నేత ప్రొఫెసర్  హరగోపాల్  తదితరులు హాజరయ్యారు.

ప్రొఫెసర్  హరగోపాల్ మాట్లాడుతూ..  గతంలో కేసీఆర్  సీఎంగా ఉన్నప్పుడు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తే భూయజమానులకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పి వారిలో లేనిపోని అపోహాలు సృష్టించారన్నారు.  ప్రస్తుత కాంగ్రెస్  ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని, 2011 చట్టం ప్రకారం కౌలు రైతులందరికీ పథకాలు అందిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ లాగే కౌలు రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి అందరూ సమన్వయంతో పోరాటం చేయాలని, దీనికి తన సహకారం ఉంటుందన్నారు. 

రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కార్యవర్గ నాయకులు కన్నెగంటి రవి, ఎస్.ఆశాలత, విస్సా కిరణ్ కుమార్, శ్రీహర్ష, బి. కొండల్  మాట్లాడుతూ 2026 మే నెల నుంచి 2011 చట్టం అమలు చేసి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు. 2011 చట్టం అమలు గురించి ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసి, కౌలు రైతులను ప్రోత్సాహించాలన్నారు. భూయజమానులకు వారి భూమి హక్కులకు ఎటువంటి సమస్య రాదని రెవెన్యూ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ కార్యాచరణకౌలు రైతుల సమస్యల పరిష్కారానికి  తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ పేరుతో ఉమ్మడి కార్యాచరణ చేపట్టి కౌలు రైతుల గుర్తింపు కోసం పోరాటం చేస్తామని ప్రజా సంఘాలు, మేధావులు ప్రకటించారు. 

ఈ కమిటీకి ప్రముఖ ఆర్థికవేత్త ఘోష్  కమిషన్  ప్రొఫెసర్  డి.నరసింహారెడ్డి అధ్యక్షత వహిస్తారన్నారు.  కాగా.. ఈ సమావేశంలో 13 జిల్లాల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తలు, కౌలు రైతులు పాల్గొని వారి సమస్యలు వివరించారు. భేటీలో  జస్టిస్ చంద్రకుమార్, కొండవీటి సత్యవతి, అరిబండి ప్రసాదరావు, అంబటి నాగయ్య,  రవిచందర్, మీరా సంఘమిత్ర, ఎం. ఆంజనేయులు, జక్కుల వెంకటయ్య  పాల్గొన్నారు.