కామారెడ్డి ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. అక్కడ టెన్షన్ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కామారెడ్డి వెళ్లేందుకు పిలుపునివ్వడంతో.. అన్ని రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. అదే విధంగా శాంతి భద్రతల దృష్ట్యా ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బాన్సువాడ వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నుమెదక్ జిల్లా పెద్ద శంకరంపేట పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు హైదరాబాద్ తార్నాక నుంచి కామారెడ్డికి బయలు దేరిన బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో తార్నాకలో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్టుకు నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు బీజేపీ కార్యకర్తలు.
కామారెడ్డిలో శనివారం (ఫిబ్రవరి 21) చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పరిసరాల్లో పోలీసుల ఆంక్షలు విధించారు. ఆదివారం బీజేపీ బృందం పర్యటన ఉన్న క్రమంలో అప్రమత్తమైన
పోలీసులు పలువురిని హౌస్ అరెస్టు చేశారు. ఎక్కడికక్కడ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ గా పోలీసుల మోహరించారు. ఎమ్మెల్యే రమణారెడ్డి క్యాంపు కార్యాలయంతో పాటు, షబ్బీర్ అలీ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరించారు.
కాలేజీ భూముల కబ్జా విషయంలో మొదలైన లొల్లి:
కాలేజీ భూముల కబ్జా ఆరోపణలతో మొదలైన లొల్లి కామారెడ్డిలో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది. బీజేపీ, కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చల సవాళ్లు, ప్రతి సవాళ్లతో దద్ధరిల్లుతోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు, శిశు మందిర్ పాఠశాల, అరోరా కాలేజీ భూముల కబ్జా విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్న క్రమంలో ఈ వివాదం మరింత ముదిరింది. నిజా నిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సవాల్ చేశారు.
చర్చకు సిద్ధమన్న కాంగ్రెస్ నేతలు కూడా సై అంటే సై అన్నారు. శిశు మందిర్ వేదికగా చర్చకు రెండు పార్టీలు సిద్ధం కావడంతో కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకులు సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఛాలెంజ్ విసిరారు. అయితే.. కాంగ్రెస్, బీజేపీ నేతల బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములకు సంబంధించి తనపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు తీసుకొని శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక శిశు మందిర్ వద్దకు రావాలని, తాను స్వయంగా వస్తానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు, కాలేజీ భూముల నుంచి స్థలాలు పొందిన సంస్థల ప్రతినిధులు, అధికారులు వస్తారన్నారు. నిజానిజాలు నిర్ధారణ చేసుకునేందుకు సాక్ష్యాలతో రావాలని కోరారు.
డిగ్రీ కాలేజీ భూముల వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలకు చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తాము కూడా వస్తామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కామారెడ్డిలో పార్టీల మధ్య విమర్శల వేడి రాజుకుంది. కాంగ్రెస్, బీజేపీనాయకులు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు విసురుకున్నారు. ఇరు పార్టీల నాయకులు రానున్నట్లు పేర్కొన్న క్రమంలో ఉత్కంఠ నెలకొంది.
