మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు.. సుచిత్రలో ఉద్రిక్తత

మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు.. సుచిత్రలో ఉద్రిక్తత

మాజీ మంత్రి మల్లారెడ్డిపై కబ్జా ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ లోని సుచిత్రలో ఉద్రిక్తత నెలకొంది. పేట్ బాషీరాబాద్ పియస్ పరిదిలోని సుచిత్ర లో గల సర్వే నెంబర్ 82 లో ఉద్రిక్తత నెలకొంది. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన 1.27 ఎకరాలో శనివారం ( మే 17 ) జిల్లా  రెవెన్యూ అధికారులు భూసర్వే నిర్వహిస్తుండగా.. అదే సర్వే నంబర్ లో ఉన్న తమ భూమిని కబ్జా చేసారంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. ఈమేరకు ఫిర్యాదు చేయడంతో 2024లో మే 19న కేసు నమోదు చేశారు పోలీసులు. 

అప్పటి వ్యవహారంలో సర్వే నెంబర్ 82లో కోర్టు తీర్పుమేరకు పోలీసుల భారీ బందోబస్తు మధ్య AD సర్వే చేపట్టారు అధికారులు. బారికేడ్స్ ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఇటు మల్లారెడ్డి, అటు ఫిర్యాదుదారుడు భారీగా అనుచరులను మోహరించడంతో ఘటనాస్థలి దగ్గర ఉద్రిక్తత నెలకొంది.

ఇదే వివాదంలో మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై 7 సెక్షన్ల కింద కేసు పెట్టారు. పేట్ బషీరాబాద్ లో 32  గుంటల స్థలం చేశారని వారిపై ఆరోపణలున్నాయి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శేరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు. తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చివేశారని బాధితుడు కంప్లైంట్ చేశాడు. 

సర్వే నెంబర్ 82లో  మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు భూకబ్జాలకు పాల్పడినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. 32 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు నివేదిక లో వెల్లడించారు. డాక్యుమెంట్ల ప్రకారం మల్లారెడ్డికి 29 గుంటల భూమి మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఈ భూవివాదంలో గతంలోనే 15 మంది బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు కేసులు, ఆదేశాలు ఉన్నప్పటికీ.. 32 గుంటలకుపైగా ఆక్రమించుకున్నారని నివేదికలో వెల్లడించారు.