- కంది మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో బీఎంపీ- 2 యుద్ధట్యాంకుల టెస్ట్ డ్రైవ్
- తయారు చేసిన మెదక్ ఆర్డెన్స్ ఫ్యాక్టరీ
- ఇన్‌బిల్ట్‌గా 30 ఎంఎం గన్,7.62 రైఫిల్, మిస్సైల్ లాంచర్
- స్మోక్ గ్రెనేడ్ లాంఛర్, ఫైర్ ప్రొటెక్షన్ కూడా..
కంది, వెలుగు : సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఓడీఎఫ్(ఆర్డెన్స్ ఫ్యాక్టరీ)లో తయారైన బీఎంపీ–2 యుద్ధ ట్యాంకులకు మల్కాపూర్ పెద్ద చెరువులో గురువారం టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. ఓడీఎఫ్ జీఎం రత్నప్రసాద్, జాయింట్ జీఎం సర్జిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ టెస్ట్ డ్రైవ్ జరిగింది. ముందుగా యుద్ధ ట్యాంకులకు జీఎం రత్నప్రసాద్ పూజలు చేశారు. తర్వాత ఆర్మీ ఆఫీసర్లతో కలిసి ట్యాంకులపై కూర్చొని చెరువులో ప్రయాణించారు. టెస్ట్‌డ్రైవ్ సక్సెస్ అయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ పరీక్షించిన వాటిలో బీఎంపీ కన్వర్షన్ ట్యాంకుతో పాటు బీఎంపీ ఓవరాయిలింగ్ ట్యాంక్ ఉందన్నారు. ఒక్కోటి 14 టన్నులు బరువు ఉంటాయని, అయినా నీళ్లలో తేలుతూ ప్రయాణం చేస్తాయన్నారు.
నీళ్లలో గంటకు 7 నుంచి 8 కిలోమీటర్లు, రోడ్డుపై గంటకు 60 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్తాయన్నారు. నైట్ విజన్ ఫెసిలిటీ ఉన్న ఈ ట్యాంకర్లలో 30 ఎంఎం గన్7.62 రైఫిల్‌తో పాటు మిస్సైల్ లాంచర్ ఉంటుందన్నారు. ఇందులో స్మోక్ గ్రెనేడ్ లాంఛర్, ఆల్ రౌండ్ ఫైర్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయన్నారు. యుద్ధ ప్రాంతంలో సైనికులను తరలించడానికి ఉపయోగపడతాయని, రష్యా టెక్నాలజీతో తయారు చేసినట్టు చెప్పారు. మెదక్ ఓడీఎఫ్ నుంచి ఇప్పటివరకు 2వేలకు పైగా యుద్ధ వాహనాలను ఆర్మీకి అందజేసినట్లు చెప్పారు. ఇంకా కొన్ని పరీక్షలు ఉన్నాయని, పూర్తి స్థాయిలో టెస్ట్ చేసిన తర్వాతే మిలిటరీకి అందజేస్తామన్నారు. డిప్యూటీ జనరల్ మేనేజర్లు వేణునాథ్, అంబటి రాంబాబు, మిలిటరీ ఆఫీసర్లు పాల్గొన్నారు.
