చంద్రుడిపై 3డీ ప్రింటింగ్​తో ఇండ్లు

చంద్రుడిపై 3డీ ప్రింటింగ్​తో ఇండ్లు

బీజింగ్:  ఏదోనాడు చంద్రుడిపై ఆస్ట్రోనాట్లు నివసించేందుకు, వీలైతే మనుషులు శాశ్వతంగా అక్కడ ఉండేందుకు ల్యాబ్​లను, ఇండ్లను నిర్మించాలన్నది అనేక దేశాల సైంటిస్టుల కల. అయితే, అందరికంటే ముందుగా చైనా అక్కడ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించనుంది. చంద్రుడిపై ఉండే మట్టితో అక్కడే ఇటుకలు తయారు చేసి, ఇండ్లు నిర్మించే దిశగా చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారని ‘చైనా డైలీ’ పత్రిక వెల్లడించింది. 

చైనా మొదటిసారిగా 2013లో చంద్రుడిపై ల్యాండర్ ను విజయవంతంగా దింపగలిగింది. ఆ తర్వాత 2020లో చాంగ్ 5 మిషన్ చేపట్టిన సీఎన్ఎస్ఏ సైంటిస్టులు మరోసారి మూన్ ల్యాండింగ్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించడంతో పాటు అక్కడి నుంచి మట్టి శాంపిల్స్ ను కూడా భూమికి తీసుకురాగలిగారు. ఇకపై దశలవారీగా చాంగ్ 6, 7, 8 మిషన్ లను చేపట్టాలని, ఆ తర్వాత ఫైనల్ గా 2030 నాటికి చంద్రుడిపైకి ఆస్ట్రోనాట్ లను పంపాలని సీఎన్ఎస్ఏ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా 2028లో చాంగ్ 8 మిషన్ ను చేపట్టనుంది. 

ఈ మిషన్ లో పంపే ల్యాండర్ లో 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ మెషీన్ లను కూడా పంపనుంది. 3డీ ప్రింటింగ్ తో చంద్రుడిపై మట్టితో ఇటుకలు తయారు చేసి, ఇండ్లను నిర్మించడంలో సాధ్యాసాధ్యాలను ఈ మిషన్ లో సీఎన్ఎస్ఏ పరీక్షించనుంది. కాగా, కొన్ని దశాబ్దాల క్రితమే చంద్రుడిపైకి మనుషులను పంపిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరోసారి అక్కడికి తమ ఆస్ట్రోనాట్ లను పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు 2024 ఏడాది చివర్లో ఆర్టెమిస్ 2 మిషన్ చేపట్టేందుకు  కసరత్తు ముమ్మరం చేసింది.