హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీగెట్–2026 షెడ్యూల్ విడుదలైంది. జూలై ఫస్ట్ వీక్‌లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ప్రకటించారు. శుక్రవారం సీపీగెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు.
బుధవారం హైదరాబాద్‌లోని టీజీసీహెచ్ఈ ఆఫీసులో వివిధ వర్సిటీల వీసీలు, అధికారులతో కలిసి సీపీగెట్ షెడ్యూల్‌ను బాలకిష్టారెడ్డి రిలీజ్ చేశారు. ఈ ఏడాది సీపీగెట్ నిర్వహణ బాధ్యతలను కాకతీయ యూనివర్సిటీకి అప్పగించినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 264 పీజీ కాలేజీలు ఉండగా, వాటిలో 43వేలకు పైగా సీట్లున్నాయని వివరించారు. గతేడాది కేవలం 45శాతమే సీట్లు నిండాయని వించారు. సీపీగెట్ ద్వారా మొత్తం 45 కోర్సుల్లో అడ్మిషన్లు చేపడుతామని, దీంట్లో 40 కోర్సులకే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పెడుతున్నట్లు వివరించారు. ఈ ఏడాది నుంచి ఐదేండ్ల ఇంటిగ్రేడెట్ కోర్సులకు దోస్త్ ద్వారా అడ్మిషన్లు ఇస్తున్నట్టు చెప్పారు.
రేపటి నుంచే దరఖాస్తులు..
సీపీగెట్ నోటిఫికేషన్ మే 15న విడుదల కానుంది. అదే రోజు నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు జూన్ 10 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 లేట్ ఫీజుతో జూన్ 14 వరకు, రూ.2 వేల ఫైన్ తో జూన్ 18 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్లలో ఏవైనా తప్పులుంటే జూన్16 నుంచి 19 వరకు సరిచేసుకోవచ్చు. జూన్ 28న వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజేందర్ కోట్ల తెలిపారు.
ఈసారి 45 రకాల పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం సీపీగెట్ నిర్వహించనున్నారు. ఓసీ, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.800 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.600గా నిర్ణయించారు. అదనంగా ఏదైనా సబ్జెక్ట్ రాయాలనుకుంటే ప్రతి సబ్జెక్టుకు రూ.450 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. జులై మొదటి వారంలో ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. జూలై 17న ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు.
