హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎప్‌సెట్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,01,194 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఎప్‌సెట్ కన్వీనర్ కె. విజయకుమార్ రెడ్డి తెలిపారు. మే 4వ తేదీ నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ప్రారంభం కానున్నట్టు ఆయన చెప్పారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ విద్యార్థులు తమ హాల్ టికెట్లను గురువారం ఉదయం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ విద్యార్థులు ఏప్రిల్ 27 నుంచి వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని వెల్లడించారు.
కాగా, ఈసారి ఇంజినీరింగ్ కోసం 2,10,308 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోసం 90,569 మంది, రెండు స్ట్రీమ్‌లకు కలిపి 317 మంది అప్లై చేసుకున్నారు. ఎప్‌సెట్ కోసం మొత్తం16 టెస్ట్ జోన్లలో 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో నాలుగు జోన్లలో కలిపి 59 కేంద్రాలు ఉండగా, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి పట్టణాల్లోనూ ఏర్పాట్లు చేశారు.

