హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి వచ్చిన విద్యార్థులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) రాష్ట్రంలో ఇంటర్న్ షిప్ (సీఆర్ఎంఐ) చేసేందుకు కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టులో పాసైన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్లు (ఎఫ్ఎంజీ) ఈ నెల 28 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎంబీబీఎస్ డిగ్రీ, కోర్సు డ్యూరేషన్ సర్టిఫికెట్, ఎన్బీఈ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ సర్టిఫికెట్ ఉండాలని పేర్కొంది.
లోకల్ స్టేటస్ కోసం 9 నుంచి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రావెల్ హిస్టరీతో కూడిన పాస్ పోర్ట్ కాపీ, యూనివర్సిటీ నుంచి ఎన్ఓసీ, మైగ్రేషన్ సర్టిఫికెట్ తదితరాలు అవసరమని తెలిపింది. లోకల్, నాన్- లోకల్ అభ్యర్థుల ఎంపికలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను కచ్చితంగా పాటిస్తామని కౌన్సిల్ పేర్కొంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కేటాయించిన ఖాళీల ఆధారంగానే ఇంటర్న్ షిప్ కేటాయింపులు ఉంటాయి. దరఖాస్తుల స్క్రూటినీ పూర్తయ్యాక కౌన్సెలింగ్ తేదీని వెబ్ సైట్ లో ప్రకటిస్తామని కౌన్సిల్ రిజిస్ట్రార్ తెలిపారు. పూర్తి వివరాల కోసం www.tsmconline.in వెబ్ సైట్ ను చూడాలని సూచించారు.

