డాక్టర్లు​ లేకున్నా హాస్పిటళ్లకు అడ్డగోలు అనుమతులు.. సర్టిఫికెట్లను వెరిఫై చేయకుండానే రెన్యువల్స్

డాక్టర్లు​ లేకున్నా హాస్పిటళ్లకు అడ్డగోలు అనుమతులు.. సర్టిఫికెట్లను వెరిఫై చేయకుండానే రెన్యువల్స్
  • అవినీతికి పాల్పడుతున్న పలువురు డీఎంహెచ్‌‌వోలు 
  • ఇటీవల టీజీఎంసీ తనిఖీల్లో బయటపడ్డ ఆఫీసర్ల బాగోతం  
  • రాష్ట్రవ్యాప్తంగా 450 కేసులు నమోదు
  • హాస్పిటల్స్, క్లినిక్స్, ల్యాబ్​కు అనుమతుల్లో రూల్స్ పాటించడం లేదని నిర్ధారణ 
  • ఇంత జరుగుతున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు
  • సూర్యాపేట కలెక్టర్​నివేదికతో డీఎంహెచ్‌‌వోపై విచారణకు మంత్రి దామోదర ఆదేశాలు 

హైదరాబాద్/సూర్యాపేట, వెలుగు: రూల్స్‌‌కు విరుద్ధంగా హాస్పిటళ్లు, క్లినిక్స్, ల్యాబ్స్‌‌కు జిల్లా వైద్యాధికారులు (డీఎంహెచ్‌‌వోలు) అనుమతులు ఇస్తున్నారు. క్వాలిఫైడ్ డాక్టర్లు లేకున్నా.. ఎంబీబీఎస్, ఎంఎస్ చదవకున్నా.. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌‌లో రిజిస్టర్ కాకున్నా.. ఆస్పత్రుల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతున్నారు. చేతిలో పైసలు పడ్తే చాలు.. ఎలాంటి అర్హతలు లేకున్నా హాస్పిటల్స్, క్లినిక్స్, ల్యాబ్స్‌‌కు టెంపరరీ, పర్మనెంట్ పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. దీనికితోడు నెలనెలా మామూళ్లు ముట్టజెప్తే తనిఖీలు జరగకుండా, నోటీసులు, కేసులు లేకుండా వాళ్లే చూసుకుంటున్నారు. 

ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న దాడుల్లో ఇలాంటి విస్తుపోయే అంశాలు  బయటపడుతున్నాయి. ఏడాది కాలంలో ఏకంగా 450 కేసులను నమోదు చేసిన టీజీఎంసీ.. ప్రధానంగా ‘క్లినికల్ ఎస్టాబ్లిష్‌‌మెంట్ యాక్ట్’ను డీఎంహెచ్‌‌వోలు తుంగలో తొక్కుతున్నారని సర్కారుకు నివేదించింది. అయినప్పటికీ సదరు అధికారులపై చర్యలు తీసుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతున్నది.  

రిజిస్టర్ అయ్యేది ఒకరు..వైద్యం చేసేది మరొకరు

హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సమయంలో క్వాలిఫైడ్ డాక్టర్లకు సంబంధించి సర్టిఫికెట్లు డీఎంహెచ్‌‌వోకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ వైద్యులే సంబంధిత హాస్పిటళ్లలో ట్రీట్మెంట్​ చేయాలి. కానీ చాలా జిల్లాల్లో రిజిస్టర్ అయిన డాక్టర్లు కాకుండా వారి స్థానంలో ఇతర డాక్టర్లు, అర్హత లేని వ్యక్తులు డాక్టర్లుగా చలామణి అవుతున్నట్టు టీజీఎంసీ తనిఖీల్లో బయటపడింది. కేవలం రిజిస్ట్రేషన్ కోసమే క్వాలిఫైడ్ డాక్టర్ల పేరును ఉపయోగిస్తూ అర్హత లేని డాక్టర్లతో వైద్యం చేయిస్తున్నారు. ఈ విషయం తెలిసి మరీ డీఎంహెచ్‌‌వోలు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఓ ఎంబీబీఎస్ డాక్టర్ తన పేరు చివరన ఎండీ అని పెట్టుకొని వైద్యం అందిస్తున్నట్లు టీఎంసీ తనిఖీల్లో బయటపడింది. 

ఇదేంటని అధికారులు అడిగితే.. ఎండీ అని ఉంటేనే పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారని ఆ డాక్టర్ ఇచ్చిన సమాధానంతో అధికారులు షాక్ తిన్నారు. అనుమతి లేని హాస్పిటళ్లు, క్లినిక్‌‌లు, ల్యాబ్‌‌లు, స్కానింగ్ సెంటర్లపై రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికాలంలో  టీజీఎంసీ అధికారులు 450 కేసులు నమోదు చేశారు. అర్హత లేని డాక్టర్లు మెడికల్​షాపులు, ఏజెన్సీలు, కంపెనీలు ఇచ్చే కమీషన్ల కోసం అడ్డగోలు యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ పేషెంట్లకు ఇష్టారీతిన రాస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతూ మెడికల్ మాఫియా రెచ్చిపోతున్నదని.. డీఎంహెచ్‌‌వోలు అవినీతికి అలవాటుపడడం, సరైన పర్యవేక్షణ లేకపోవడతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వానికిచ్చిన నివేదికలో అధికారులు స్పష్టం చేశారు.

చట్టాన్ని తుంగలో తొక్కి.. 

క్లినికల్ ఎస్టాబ్లిష్‌‌మెంట్ యాక్ట్ ప్రకారం ఒక హాస్పిటల్‌‌కు అనుమతి పొందాలంటే సవాలక్ష రూల్స్ పాటించాలి. లీజ్ డాక్యుమెంట్, బయోమెడికల్ వేస్టేజ్ పర్మిషన్, ఫార్మసీ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఎక్స్ రే, సీటీ స్కాన్‌‌ల కోసం పర్మిషన్ పొందాలి. డాక్టర్లకు సంబంధించి ఎంబీబీఎస్, స్పెషలైజేషన్ డిగ్రీ ఉండాలి. ఈ డిగ్రీలు ఇండియన్ మెడికల్ కౌన్సిల్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందడంతో పాటు రాష్ట్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అన్ని పర్మిషన్లు సరిగ్గా ఉంటే జిల్లా వైద్యాధికారులు హాస్పిటల్‌‌లో ఎక్విప్మెంట్, బెడ్ స్ట్రెంత్‌‌కు తగిన అకామిడేషన్ ఉందా లేదా చూశాక మొదట టెంపరరీ పర్మిషన్లు ఇవ్వాలి. 

90 రోజుల తర్వాత ఎలాంటి కంప్లయింట్స్​రాకపోతే పర్మనెంట్ పర్మిషన్లు అందజేయాల్సి ఉంటుంది. కానీ డీఎంహెచ్‌‌వోలు ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, మేడ్చల్ తదితర జిల్లాల్లో వైద్యా ధికారులు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నారని టీజీఎంసీ తనిఖీల్లో బయటపడింది. తమ పరిధిలో ఇంత జరుగుతున్నా డైరెక్టర్ ఆఫ్​హెల్త్, ఇతర ఉన్నతాధికారులు స్పందించకపోవడం 
విమర్శలకు తావిస్తోంది. 

సూర్యాపేట డీఎంహెచ్‌‌వోపై ఎంక్వైరీ.. 

సూర్యాపేట జిల్లాలో అనుమతి లేని హాస్పిటళ్లు,  అర్హత లేని వైద్యులపై టీజీఎంసీకి కంప్లయింట్స్ అందాయి. దీంతో రంగంలోకి దిగిన టీజీఎంసీ అధికారులు ఇటీవల వరుసగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. శరత్ కార్డియాక్ సెంటర్‌‌‌‌లో డాక్టర్ లేకుండానే ఒక ఆపరేటర్ హాస్పిటల్‌‌ను నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. సీటీ స్కానింగ్​సెంటర్​నిర్వహిస్తున్నది అసలు డాక్టరే కాదని తేలింది. ఆయన 13 ఏండ్లుగా నకిలీ సర్టిఫికెట్‌‌తో రేడియాలజిస్ట్‌‌గా చలామణి అవుతున్నాడు. ఇటీవల సదరు డాక్టర్ నకిలీ సర్టిఫికెట్ పెట్టి, స్కానింగ్ సెంటర్‌‌‌‌ను మరోసారి రెన్యూవల్ చేయించుకున్నట్టు తేల్చారు. 

మరో హాస్పిటల్‌‌లో మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్ వ్యాలిడిటీ పూర్తయ్యాక కూడా ఏండ్ల తరబడి రెన్యూవల్ చేయకుండానే ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్లో సూర్యాపేటలోనే  ఏకంగా 55 హాస్పిటళ్లను ఎలాంటి అనుమతులు లేకుండా అర్హతలు లేని డాక్టర్లు నిర్వహిస్తున్నట్టు తేల్చారు. దీంతో ఈ లిస్టును కలెక్టర్‌‌‌‌కు అందించారు. అనంతరం కలెక్టర్ నివేదిక మేరకు సూర్యాపేట డీఎంహెచ్‌‌వోపై ఆరోగ్యశాఖ మంత్రి  దామోదర రాజనర్సింహ విచారణకు ఆదేశించారు.