హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7 ఖాళీలను జనరల్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుండగా, దీనిలో స్టేట్ లెవల్ కేడర్‌లో 2, మల్టీ జోనల్ కేడర్‌లో 5 పోస్టులు ఉన్నాయి.
అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15 నుంచి ఆగస్టు 22 వరకు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ (https://www.tgpsc.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీ ప్లానింగ్, బీటెక్ ప్లానింగ్ విద్యార్హత కలిగి ఉండాలని ఆమె స్పష్టం చేశారు. పరీక్ష విధానం, సిలబస్, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
