- పీసీబీ, టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్, ఏఈ, డిప్యూటీ ఈఓ సహా పలు పోస్టుల భర్తీకి ఏర్పాట్లు
- ఇప్పటికే ఓ నోటిఫికేషన్ రిలీజ్.. మిగతా పోస్టుల భర్తీకి
- ఆర్థికశాఖ నుంచి క్లియరెన్స్
- పరీక్షల క్లాష్ లేకుండా, ప్రిపరేషన్‌కు తగిన సమయం ఇచ్చేలా షెడ్యూల్
- ఓటీఆర్ అప్‌డేట్ చేసుకుంటేనే దరఖాస్తుకు అవకాశం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసం ఇకపై నెలకో నోటిఫికేషన్ ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పక్కా ప్లాన్ చేస్తున్నది. నోటిఫికేషన్ల జారీలో జాప్యం జరగకుండా, అభ్యర్థులు ప్రిపరేషన్‌కు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కసరత్తు చేపట్టింది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన సుమారు 2,500 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు, ఎగ్జామ్ షెడ్యూల్ రూపొందించే పనిలో కమిషన్ అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత టీజీపీఎస్సీ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-2 ) పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఈ నెల 27 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలుకానున్నది. త్వరలోనే అదే పీసీబీ విభాగంలోనే మరో ఆరు, ఏడు రకాల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. వీటితోపాటు కీలకమైన టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్ ఆఫీసర్లు, వివిధ శాఖల్లోని అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ చేసింది. విద్యాశాఖలోనూ డిప్యూటీ ఈఓలు, డైట్ లెక్చరర్లు, బీఈడీ లెక్చరర్ల పోస్టులతో పాటు ఆర్టీసీ, సివిల్ సప్లై విభాగాల్లోని పలు పోస్టుల భర్తీకి కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నది.
పరీక్షలు క్లాష్ లేకుండా షెడ్యూల్..
నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా..పరీక్షల నిర్వహణలోనూ టీజీపీఎస్సీ కొత్త విధానాన్ని పాటించబోతున్నది. ఇతర రాష్ట్రస్థాయి ఉద్యోగ పరీక్షలు, యూపీఎస్సీ, ఎస్ఎస్‌సీలాంటి జాతీయస్థాయి ఎగ్జామ్స్ తేదీలను దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను రూపొందిస్తున్నది. దీంతో నిరుద్యోగులు ఒకే సమయంలో రెండు పరీక్షల మధ్య ఇబ్బంది పడకుండా అన్నింటికీ హాజరయ్యే అవకాశం లభించనున్నది. వీలైనంత త్వరగా ఇప్పటికే ఫైనాన్స్ క్లియరెన్స్ ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను పట్టా లెక్కించాలని అధికారులు భావిస్తున్నారు.
కొలువుల భర్తీలో పెరిగిన వేగం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. టీజీపీఎస్సీ ద్వారా ఇప్పటికే వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న ఫలితాలను రిలీజ్ చేసి సుమారు 26 వేల పోస్టులను భర్తీ చేశారు. గ్రూప్స్ పోస్టులను పెంచి నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చింది. మొత్తంగా అన్ని బోర్డుల కింద 70 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది.
గ్రూప్స్ సహా పలు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందించారు. అదే స్ఫూర్తితో కొత్త నోటిఫికేషన్లను కూడా త్వరత్వరగా పూర్తి చేయాలని కమిషన్ నిర్ణయించింది. నెలవారీ నోటిఫికేషన్ల విధానంతో మిగిలిన ఖాళీలను కూడా త్వరితగతిన భర్తీ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీంతో నిరుద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
ఓటీఆర్ అప్‌డేట్ కంపల్సరీ..
టీజీపీఎస్సీ ఓటీఆర్ అప్‌డేట్‌పై చాలామంది నిరుద్యోగులు దృష్టి సారించడం లేదు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది ఓటీఆర్ కలిగి ఉండగా.. వారిలో 12 లక్షల మంది మాత్రమే రెగ్యులర్‌గా వివిధ పరీక్షలకు అప్లై చేసుకుంటున్నారు. అయితే, ఓటీఆర్ అప్‌డేట్ చేసుకోవాలని టీజీపీఎస్సీ ప్రకటించింది. 2 సార్లు గడువు పెంచినా ఇప్పటికీ కేవలం 6 లక్షల మంది మాత్రమే అప్‌డేట్ చేసుకున్నట్టు కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. కాగా, కొత్త నోటిఫికేషన్లలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఓటీఆర్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వరుస నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉండటంతో అభ్యర్థులు తప్పనిసరిగా ఓటీఆర్ అప్‌డేట్ చేసుకొని ఉండాలని కమిషన్ అధికారులు సూచిస్తున్నారు.

