స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీపై సుప్రీంలో పిటిషన్...విచారణ జులై 13కు వాయిదా

స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీపై  సుప్రీంలో పిటిషన్...విచారణ జులై 13కు వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో, తదుపరి విచారణను జులై 13కు వాయిదా వేస్తున్నట్టు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. టీజీపీఎస్సీ గతంలో స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించింది. బీటెక్ విద్యార్హత కలిగిన పలువురు అభ్యర్థులు కూడా ఈ పరీక్షకు హాజరయ్యారు.

అయితే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో బీటెక్ అభ్యర్థులు ఈ పోస్టుకు కావాల్సిన పూర్తి స్థాయి ‘స్టాటిస్టిక్స్’ సబ్జెక్టును చదవలేదని టీజీపీఎస్సీ వారిని అనర్హులుగా ప్రకటించింది. టీజీపీఎస్సీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు.. టీజీపీఎస్సీ నిర్ణయం సరైనదేనంటూ కమిషన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వై. జగదీష్‌తో పాటు మరో 13 మంది అభ్యర్థులు గత నెల 8న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది.