ఇండిగో సంక్షోభం: రంగంలోకి TGSRTC .. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక బస్సులు

ఇండిగో సంక్షోభం: రంగంలోకి TGSRTC .. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక బస్సులు

ఇండిగో సంక్షోభంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ప్రయాణికులు ఎయిరోపోర్టులోనే పడిగాపులు గాస్తున్నారు. ఈ క్రమంలో  ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ  ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి చెన్నై,బెంగళూరుకు ప్రత్యేక స్లీపర్  బస్సులను నడిపేందుకు ముందుకొచ్చింది.

ఇవాళ్టి నుంచి తాత్కాలికంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు అరైవల్ ర్యాంప్ – పిల్లర్ నంబర్ 08 దగ్గర నుంచి రెండు స్లీపర్ బస్సులు  నడపనుంది టీజీఎస్ ఆర్టీసీ.  సాయంత్రం 4.30 గంటలకు చెన్నైకి ఒక బస్సు..బెంగళూరుకు మరో బస్సు బయలు దేరనున్నాయి. చెన్నైకి  ఒక వ్యక్తికి టికెట్ ధర రూ. 2110,   బెంగళూరుకు  వెళ్లే ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ. 1670 గా నిర్ణయించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం  వరకు  అదనపు బస్సులు జోన్ డీ నుంచి నడవనున్నాయి. 

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణికుల ఆత్మస్థైర్యం, సౌకర్యం దృష్టిలో పెట్టుకుని ఈ సంయుక్త ప్రయత్నం ప్రయాణికులకు కొంత ఉపశమనాన్ని అందించాలన్న నిజమైన ఉద్దేశంతో టీజీఎస్ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 

అటు దక్షిణ మధ్య రైల్వే కూడా 37 ప్రీమియం రైళ్లలో 116 అదనపు కోచ్ లను ఏర్పాటు చేసింది. ముఖ్యమైన 10 రూట్లలో ఇవాళ్టి నుంచి డిసెంబర్ 10 వరకు 37 ప్రీమియం రైళ్లకు మొత్తం 116 అదనపు కోచ్ లను జత చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు

మరో వైపు విమాన టికెట్ల ధరల పెంపుపై కేంద్రం సీరియస్‌.. సంక్షోభాన్ని క్యాష్ చేసుకోవద్దని హెచ్చరిక.. అడ్డగోలుగా రేట్లు పెంచితే ఊరుకోబోమని వార్నింగ్‌.. నిర్దేశించిన ఛార్జీల పరిమితులను ఖచ్చితంగా పాటించాలని ఆదేశం.. ఇబ్బందుల్లో ఉన్న ప్రయాణికులను దోచుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది