హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చే నెల మూడో వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కార్మిక శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఎన్నికల కోసం కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సునీతాదాస్ గుప్తాను ఇప్పటికే రిటర్నింగ్ అధికారిగా నియమించింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లలో ఆ శాఖ నిమగ్నమైంది.
ఓటర్ల గుర్తింపు ప్రక్రియ, పోలింగ్ స్టేషన్లు, పోటీ చేయడానికి ఏయే యూనియన్లకు అర్హత ఉంది, బ్యాలెట్ పేపర్లు ముద్రణ, ఎన్నికల నిర్వహణ కోసం ఎంత మంది అధికారులు, సిబ్బంది అవసరం వంటి విషయాలపై కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ విషయంలో ఎప్పటికప్పుడు ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక శాఖ సమన్వయం చేసుకుంటోంది. గుర్తింపు సంఘం ఎన్నికలను పూర్తి ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించనున్నట్లు ఆఫీసర్లు తెలిపారు.
