TGSRTC: బతుకమ్మ, దసరాకు 7,754 స్పెషల్ బస్సులు

TGSRTC: బతుకమ్మ, దసరాకు  7,754 స్పెషల్ బస్సులు

 

  • 20 నుంచి వచ్చే నెల 2 వరకు నడపాలని ఆర్టీసీ నిర్ణయం
  • రాష్ట్రంతో పాటు.. ఏపీ, కర్నాటక, మహారాష్ట్రకు సర్వీసులు
  • స్పెషల్ బస్సుల్లో మాత్రమే అదనపు చార్జీలు
  • ఆన్​లైన్​లో ముందస్తు రిజర్వేషన్

హైదరాబాద్, వెలుగు:  బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 7,754 ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఆ సంస్థ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఏపీ, కర్నాటక, మహారాష్ట్రకు ప్రత్యేక బస్సులను నడుపనున్నారు.  గతేడాది దసరాతో కంటే ఈ దసరాకు అదనంగా 617 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇందులో 377 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఈ నెల 30 న బతుకమ్మ, వచ్చే నెల 2న దసరా ఉన్నందున సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, అప్పటి పరిస్థితిని బట్టి అవసరమైతే మరిన్ని అదనపు బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. ఇక దసరా అనంతరం వచ్చే నెల 5 , 6 తేదీల్లో కూడా తిరుగు ప్రయాణం కోసం రద్దీ ఉండే అవకాశం ఉంటుందని, రద్దీకి అనుగుణంగా మరిన్ని అదనపు బస్సులు వేసేందుకు అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్​లోని ఏంజీబీఎస్, జేబీఎస్ తో పాటు కేపీహెచ్‌‌‌‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్డు, దిల్‌‌‌‌సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ తదితర బస్టాప్​ల నుంచి ఈ ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు.

రెగ్యులర్ బస్సుల చార్జీల్లో మార్పులేదు

దసరా స్పెషల్ బస్సుల్లో మాత్రమే టికెట్ ధరలు సాధారణ రోజుల కన్నా ఎక్కువగా ఉంటాయని, రెగ్యులర్ గా నడిచే బస్సుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా వచ్చే అవకాశం ఉన్నందున, బస్సులకు అయ్యే కనీస డీజిల్ చార్జీల కోసం ఈ స్పెషల్ బస్సులలో అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ సంస్థ అధికారిక వెబ్‌‌‌‌ సైట్ tgsrtcbus.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని యాజమాన్యం స్పష్టం చేసింది. బతుకమ్మ, దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం 040–6944 0000 లేదా 040–2345 0033 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ప్రయాణీకులకు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.