కబ్జా చెర వీడిన పార్కులో కార్తీక శోభ.. నిజాంపేట హైడ్రాకు వనభోజనాలతో కృతజ్ఞతలు

కబ్జా చెర వీడిన పార్కులో కార్తీక శోభ.. నిజాంపేట హైడ్రాకు వనభోజనాలతో కృతజ్ఞతలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: కబ్జాదారుల చెరలో మగ్గిపోయి, తమకు కాకుండా పోయిన పార్కును హైడ్రా తిరిగి అప్పగించడంతో నిజాంపేట మున్సిపాలిటీలోని కౌశల్యానగర్​వాసులు ఆనందం వ్యక్తం చేశారు. హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆదివారం బనియన్​ట్రీ పార్కులో కార్తీక వనభోజనాలు నిర్వహించారు. అక్కడే సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. చిన్నా, పెద్దా, మహిళలు, యువకులు ఇలా దాదాపు వెయ్యి మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు హైడ్రా జిందాబాద్ అని నినాదాలు చేశారు. హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డులను ప్రదర్శించారు.

రెండు పార్కుల్లో ఇదొకటి..

నిజాంపేట మున్సిపాలిటీలో ఇటీవల హైడ్రా రెండు పార్కులను కబ్జాల నుంచి రక్షించింది. అందులో ఒకటి బృందావన్ కాలనీలోని 2,300 గజాల పార్కు కాగా, మరొకటి కౌశల్యానగర్‌‌లోని 300 గజాల బనియన్ ట్రీ పార్కు ..ఈ పార్కు చుట్టూ ప్రహరీ నిర్మించిన కబ్జాదారులు.. స్థానికులను లోపలికి రాకుండా అడ్డుకున్నారు.  దీంతో వారు హైడ్రాకు ఫిర్యాదు చేయగా, ఆక్రమణలు తొలగించింది. 

హైడ్రా వచ్చింది.. దారులు తెరిచింది

బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలోని ఫార్చ్యూన్ మెడోస్ కాలనీ వాసులు కూడా హైడ్రాకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. తమ కాలనీలో రాకపోకలకు అడ్డంగా ఉన్న గోడలను తొలగించి, సిమెంట్ రోడ్డు నిర్మించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ‘హైడ్రా వచ్చింది.. దారులు తెరిచింది’  అంటూ తమ ప్రాంత అభివృద్ధికి దోహదపడిన అధికారులకు థాంక్స్​చెప్పారు.