- మద్యం మత్తులో బండరాయితో కొట్టి హత్య
- నల్గొండ మండలం దామరచర్ల మండలంలో ఘటన
మిర్యాలగూడ, వెలుగు : తంబాకు ఇయ్యలేదని తోటి కార్మికుడిని బండరాయితో కొట్టి హత్య చేశాడు మరో కార్మికుడు. ఈ ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో జరిగింది. హత్యకు సంబంధించిన వివరాలను మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి శనివారం తన ఆఫీసులో మీడియాకు వెల్లడించారు.
జార్ఖండ్ కు చెందిన రఘునందన్ రామ్ (42) నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. బిహార్‌కు చెందిన ఓంప్రకాశ్ గుప్తా అదే ప్లాంట్ లో వెల్డింగ్ హెల్పర్ గా పనిచేస్తున్నాడు. ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది. ఈ నెల 25న ప్లాంట్ సమీపంలోని దుకాణంలో ఇద్దరూ కలిసి మధ్యాహ్నం వరకు మందు తాగారు. అనంతరం ప్లాంట్ కు వెళ్తున్న రఘునందన్ రామ్ ను తంబాకు (ఖైనీ) ఇవ్వాలని ఓం ప్రకాశ్ గుప్తా అడిగాడు. అయితే రఘునందన్ తంబాకు ఇయ్యకుండా ఓం ప్రకాశ్ ను తిడుతూ ప్లాంట్ వైపు బయలుదేరాడు.
మద్యం మత్తులో ఉన్న ఓం ప్రకాశ్.. వెంటనే బండరాయి తీసుకొని రఘునందన్ తలపై విసిరాడు. అతను కింద పడగానే మరోసారి తలపై బండరాయితో కొట్టి హత్య చేసి పారిపోయాడు. ఎవరో వ్యక్తులు రఘునందన్ ను హత్య చేశారని మృతుని కుటుంబ సభ్యులు ఈ నెల 26న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల సాయంతో ఓం ప్రకాశ్ గుప్తాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
