- విద్యాశాఖ ఉన్నతాధికారులకే తప్పుడు సమాచారం..?
- ఏడాదిన్నరగా లేని బయోమెట్రిక్.. ఉన్నట్లు బుకాయింపు
హైదరాబాద్, వెలుగు: సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో అటెండన్స్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ‘బయోమెట్రిక్ తీసేసిర్రు.. ఫెషియల్ పెడ్తలేరు’ అనే హెడ్డింగ్ తో రెండ్రోజుల క్రితం ‘వెలుగు’లో వచ్చిన కథనం.. విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన స్పందించారు. వర్సిటీ రిజిస్ట్రార్ హన్మంతరావుకు ఫోన్ లో వివరణ కోరినట్లు తెలిసింది. అయితే, సదరు అధికారి కమిషనర్‌కు వాస్తవాలు చెప్పాల్సింది పోయి, తప్పుడు సమాచారం ఇచ్చినట్టు సమాచారం.
ఉద్యోగులకు ఉన్నది.. విద్యార్థులకు లేదట..!
వర్సిటీలో బయోమెట్రిక్, ఫెషియల్ అటెండెన్స్ విధానంపై కమిషనర్ అడిగిన ప్రశ్నలకు రిజిస్ట్రార్ వింత సమాధానం ఇచ్చినట్లు సమాచారం. స్టూడెంట్లకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం లేదని, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి మాత్రమే అమల్లో ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి తోడు కావాలనే విద్యార్థులు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పినట్లు సమాచారం. వర్సిటీలో దాదాపు ఏడాదిన్నర కాలంగా బయోమెట్రిక్ విధానం అమలు కావడం లేదని సిబ్బంది బాహాటంగానే చర్చించుకుంటున్నారు. సాక్షాత్తూ విద్యాశాఖ కమిషనర్‌కే తప్పుడు సమాచారం ఇవ్వడంపై ఇప్పుడు వర్సిటీ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది.
అటెండెన్స్ మిషన్లు పనిచేయడం లేదనే సమాచారం రిజిస్ట్రార్‌కు తెలియదా..? లేక వర్సిటీలో జరుగుతున్న లోపాలను కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు సమాచారం ఇచ్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయోమెట్రిక్, ఫెషియల్ అటెండెన్స్ వంటి పారదర్శక విధానాలను పక్కనపెట్టి, పాత పద్ధతిలో అటెండెన్స్ వేయడం వెనుక ఉన్న మతలబు ఏంటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటకు తీయాలని కోరుతున్నారు.

