ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. వరుసగా 22 వన్డే మ్యాచులు గెలిచి తన సత్తా చాటింది. న్యూజిలాండ్, మౌంట్ మౌంగనుయిలోని బే ఓవల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో గెలిచి ఈ రికార్డును సాధించారు. ఒక మహిళా జట్టు వరుసగా 22 మ్యాచులు గెలవడం ఇదే తొలిసారి. మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా.. ఆస్ట్రేలియా జట్టు ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టును ఓడించి అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ప్రపంచ రికార్డును సృష్టించింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పురుషుల జట్టు పేరు మీద ఉంది. రికీ పాంటింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా పురుషుల జట్టు వన్డేల్లో వరుసగా 21 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆ రికార్డును ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు చెరిపేసింది.
భారత్‌తో 2018 మార్చిలో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో గెలుచుకొని ఆస్ట్రేలియా తన విజయదుందుభిని ప్రారంభించింది. అప్పటినుంచి ఆస్ట్రేలియా మహిళల జట్టు వరుసగా విజయాలు సాధిస్తూ వస్తోంది. ఆ తర్వాత పాకిస్తాన్ మీద 3-0, న్యూజిలాండ్ మీద 3-0, ఇంగ్లాండ్ మీద 3-0, వెస్టిండీస్ మీద 3-0, శ్రీలంక మీద 3-0, న్యూజిలాండ్ మీద 3-0తో గెలిచింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతున్న 3-మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు వన్డేల్లో చివరిసారిగా 2017 అక్టోబర్‌లో ఓడిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఓటమిని చవిచూడలేదు.

