హక్కుగా రావాల్సిన నిధులే ఇవ్వడం లేదు

హక్కుగా రావాల్సిన నిధులే ఇవ్వడం లేదు
  • బకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా ఫలితం ఉంటలే  
  • కేంద్రంలో ఎక్కని కొండ లేదు.. మొక్కని బండ లేదు  
  • సంజయ్​వి అన్నీ అబద్ధాలే  
  • కిషన్ రెడ్డికి దమ్ముంటే బకాయిలు ఇప్పించాలి 
  • రెండ్రోజుల్లో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తది 

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎక్కువ నిధులు రావడం కాదు కదా.. హక్కుగా రావాల్సిన నిధులే ఇవ్వడం లేదని మంత్రి హరీశ్​రావు అన్నారు. ‘‘రాష్ట్రానికి నిధులన్నీ కేంద్రమే ఇస్తోందని బండి సంజయ్ గోబెల్స్‌‌ మాదిరిగా అబద్ధాలు చెప్తున్నారు. బకాయిలు చెల్లించాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా ఫలితం లేదు. రావాల్సిన నిధులు ఇవ్వాలని కేంద్రంలో ఎక్కని కొండ లేదు.. మొక్కని బండ లేదు” అని అన్నారు. శనివారం టీఆర్‌‌ఎస్‌‌ ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రలో సంజయ్‌‌ అన్ని అబద్ధాలు, అసత్యాలే చెప్తున్నారని హరీశ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం రూ.3 లక్షల కోట్లు ఇచ్చిందని జూటా ప్రచారం చేయడం, కాకి కబుర్లు చెప్పడం మానుకోవాలన్నారు. ఏడేండ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.3,65,797 కోట్లు వెళ్తే.. అందులో నుంచి రాష్ట్రానికి రూ.1,68,647 కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయని చెప్పారు. 

ఇవి తాను చెప్తున్న లెక్కలు కావని, కాగ్‌‌ అధికారిక లెక్కలని తెలిపారు. గ్రాంట్లు, బీఆర్‌‌జీఎఫ్‌‌, జీఎస్టీ పరిహారం, సీఎస్‌‌ఎస్‌‌ బకాయిలు కలిపి కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.7,183 కోట్లు రావాల్సి ఉందని.. కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డికి దమ్ముంటే ఆ నిధులు ఇప్పించాలని సవాల్‌‌ విసిరారు. పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, రైతు వేదికలకు కేంద్రమే నిధులిస్తే మిగతా రాష్ట్రాల్లో అవి ఎందుకు లేవో చెప్పాలని సంజయ్ ని ప్రశ్నించారు. పక్కనున్న కర్నాటకకు వెళ్లి అక్కడి పల్లెలు ఎట్లున్నయో చూద్దాం.. అందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో మలేరియా తగ్గడానికి పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులే కారణమన్నారు. దాన్ని గుర్తించి కేంద్రమే అవార్డు ఇచ్చినా సంజయ్‌‌కి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.  
రాష్ట్రాల ఆదాయానికి కేంద్రం గండి.. 
రాష్ట్రాలకు పన్నుల్లో వాటాగా రావాల్సిన ఆదాయానికి సెస్సుల పేరుతో కేంద్రం గండి కొడుతోందని హరీశ్ మండిపడ్డారు. పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వాల్సి ఉండగా, సెస్సుల్లో 29.6 శాతం వాటానే ఇస్తోందని చెప్పారు. ఇది రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచేందుకు చేస్తున్న కుట్ర అన్నారు. ‘‘పెట్రోల్‌‌పై రూ.27, డీజిల్‌‌పై రూ.21 సెస్సు రూపంలో కేంద్రం వసూలు చేస్తోంది. యూపీఏ కన్నా ఎన్‌‌డీఏ హయాంలో సెస్సులు భారీగా పెరిగాయి. నిరుడు సెస్సులతో  కేంద్రానికి రూ.4 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. తాను చెప్పేవి తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా” అని సవాల్ చేశారు.  
సంజయ్ మాటలకు జనం నవ్వుకుంటున్నరు 
సంజయ్‌‌కి ఏ సబ్జెక్టుపైనా అవగాహన లేదని, ఆర్డీఎస్‌‌పై ఆయన మాట్లాడిన తీరు చూసి నడిగడ్డ ప్రజలు నవ్వుకుంటున్నారని హరీశ్ విమర్శించారు. పోతిరెడ్డిపాడుతో  ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటే డీకే అరుణ హారతులిచ్చి ఆర్డీఎస్‌‌ రైతులకు అన్యాయం చేస్తే.. సీఎం కేసీఆర్‌‌ తుమ్మిళ్ల లిఫ్ట్‌‌ పెట్టి న్యాయం చేశారన్నారు. డీకే అరుణను ఆర్డీఎస్‌‌ అరుణగా పిలవాలని సంజయ్‌‌ అనడం మిలీనియం ఆఫ్‌‌ ది జోక్‌‌ అని అన్నారు. సంజయ్‌‌, కిషన్‌‌రెడ్డిలకు దమ్ముంటే తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టు అయినా జాతీయ హోదా ఇప్పించాలని సవాల్ విసిరారు. 
నీట్‌‌లో లోపాలతోనే సీట్ల బ్లాకింగ్‌‌ దందా 
నీట్‌‌లో లోపాలతోనే పీజీ మెడికల్‌‌ సీట్ల బ్లాకింగ్‌‌ దందా జరుగుతోందని హరీశ్‌‌ అన్నారు. కౌన్సెలింగ్‌‌లో భర్తీకాని సీట్లను కాలేజీలు ఫిలప్‌‌ చేసుకోవచ్చని సుప్రీం తీర్పు చెప్పిందని, దాన్ని అడ్డుపెట్టుకొనే కొన్ని కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. దీనికి చెక్‌‌ పెట్టేందుకు కాళోజీ హెల్త్‌‌ యూనివర్సిటీ వీసీతో పోలీసులకు కంప్లైంట్‌‌ చేసిందని గుర్తు చేశారు. రెండు, మూడు రోజుల్లో పోలీస్‌‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌‌ వస్తుందని చెప్పారు.