మెడికోల పరిస్థితి అగమ్యగోచరం

మెడికోల పరిస్థితి అగమ్యగోచరం
  • నిరాశలో ఉక్రెయిన్​లో చదివిన స్టూడెంట్లు
  • పర్మిషన్ రద్దుతో ఆందోళనలో 3 కాలేజీల విద్యార్థులు  
  • ఇయ్యాల జంతర్ మంతర్ వద్ద మెడికోల ధర్నా  

హైదరాబాద్, వెలుగు:  కరోనా సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధం మన దేశ, రాష్ట్ర మెడికల్ స్టూడెంట్ల భవిష్యత్‌‌‌‌ను అగమ్యగోచరంగా మార్చింది. కరోనా కాలంలో చైనా నుంచి తిరిగొచ్చిన స్టూడెంట్లను ఇప్పటికీ ఆ దేశం రానివ్వడం లేదు. నాలుగు నెలల క్రితం రష్యా దాడులతో ఉక్రెయిన్ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇండియాకు తిరిగొచ్చిన మెడికోల పరిస్థితి కూడా అట్లనే తయారైంది. యుద్ధ సమయంలో స్టూడెంట్లను కాపాడుకుంటామని ప్రకటనలు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు వారి గురించి అసలు పట్టించుకోవడం లేదు. దీంతో మూడు రోజుల క్రితం ఢిల్లీలోని నేషనల్ మెడికల్ కమిషన్ ఎదుట మెడికోలు, వారి పేరెంట్స్ ఆందోళన కూడా చేపట్టారు. అధికారులు స్పందించకపోవడంతో ఆదివారం జంతర్‌‌‌‌‌‌‌‌మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. రాష్ట్రం నుంచి కొందరు స్టూడెంట్లు, పేరెంట్స్ కూడా ఈ ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లారు. తెలంగాణకు చెందిన 700 మంది స్టూడెంట్లు ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చారని, వారందరినీ ఇక్కడి మెడికల్ కాలేజీల్లోనే అడ్జస్ట్ చేయాలని పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి అశోక్‌‌‌‌ డిమాండ్ చేశారు.  

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే క్లాసులు, ఎగ్జామ్స్‌‌‌‌

చైనా యూనివర్సిటీల మాదిరిగానే, ఉక్రెయిన్ వర్సిటీలు కూడా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఇటీవల ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాయి. అయితే, క్లినికల్ ఎక్స్‌‌‌‌పోజర్ లేకుండా కేవలం ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ క్లాసులు, థియరీ ఎగ్జామ్స్ రాయడం వల్ల డాక్టర్లు కాలేరన్నది అందరికీ తెలిసిందే. చైనా నుంచి వచ్చిన స్టూడెంట్లు రెండేండ్లుగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో క్లాసులు వింటూ, ఎగ్జామ్స్‌‌‌‌ రాస్తున్నారు. కానీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌‌‌‌ రాయకుండా, వీరి డిగ్రీలను పరిగణించబోమని ఎన్‌‌‌‌ఎంసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఉక్రెయిన్ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్లకూ ఇదే నిబంధన వర్తించనుంది. దీంతో కొంత మంది స్టూడెంట్లు ధైర్యం చేసి రష్యాకు వెళ్లి, అక్కడి కాలేజీల్లో చేరుతున్నారు. ఉక్రెయిన్‌‌‌‌లో చదివిన సర్టిఫికెట్లు చూపిస్తే, అడ్మిషన్లు ఇచ్చేందుకు రష్యా వర్సిటీలు ముందుకొస్తున్నాయి. అయితే, ఈ అడ్మిషన్లను ఎన్‌‌‌‌ఎంసీ అంగీకరించాల్సి ఉంటుంది.  

ఆ 3 కాలేజీల్లో మెడికోల ధర్నా 

ఇటీవల పర్మిషన్ రద్దు అయిన 3 కాలేజీల మెడికోల పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. ఎంఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌, టీఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌, మహావీర్ కాలేజీల్లో సౌలతులు లేవని ఎన్‌‌‌‌ఎంసీ అనుమతులు రద్దు చేసింది. ఈ కాలేజీల్లోని 450 ఎంబీబీఎస్‌‌‌‌, 80 మంది పీజీ స్టూడెంట్లను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఏయే కాలేజీల్లో ఎంత మందిని అడ్జస్ట్ చేశారో చెబితే, ఆ మేరకు ఆయా కాలేజీల్లో సీట్ల పెంపునకు పర్మిషన్ మంజూరు చేస్తామంది. అయితే, తొలుత సీట్లు పెంచాలని, ఆ తర్వాతే తాము స్టూడెంట్లను సర్దుబాటు చేస్తామని రాష్ట్ర సర్కార్ చెబుతోంది. దీంతో అటు ఎన్‌‌‌‌ఎంసీ, ఇటు రాష్ట్ర సర్కార్ నడుమ స్టూడెంట్ల భవితవ్యం సందిగ్ధంలో పడింది. ఓ వైపు పర్మిషన్ రద్దు అవగా, మరోవైపు ఫీజులు మొత్తం కట్టాలని స్టూడెంట్లపై ఆయా కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో శనివారం కాలేజీల ఎదుట మెడికోలు ధర్నాలు 
చేపట్టారు. 

సర్కార్ కాలేజీల్లో స్టాఫ్ కొరత 

రాష్ట్రంలో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే, అన్నింటిలోనూ ప్రొఫెసర్ల కొరత ఉంది. అత్యధికంగా 1,301 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు కలిపి మరో 300 వరకు ఖాళీగా ఉన్నాయి. ట్యూటర్, ఇతర అడ్మినిస్ట్రేషన్ పోస్టులు మరో 300 కు పైగా కొరత ఉంది. ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ నుంచి పర్మిషన్ వచ్చినప్పటికీ, ఇప్పటివరకూ రిక్రూట్‌‌‌‌మెంట్ నోటిఫికేషన్ రాలేదు. గైనకాలజీ, జనరల్ మెడిసిన్ వంటి కీలక విభాగాల్లో సగానికి సగం పోస్టులు ఖాళీగానే ఉన్నాయని చెబుతున్నారు.