తెలంగాణలో 23కు చేరిన వరద బాధిత మృతులు.. సైంటిస్ట్ అశ్వినికి కన్నీటి వీడ్కోలు

తెలంగాణలో 23కు చేరిన వరద బాధిత మృతులు.. సైంటిస్ట్ అశ్వినికి కన్నీటి వీడ్కోలు

వెలుగు, నెట్​వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు మృతుల సంఖ్య 23కు చేరింది. శని, ఆదివారాల్లో గల్లంతైన వారి డెడ్​బాడీలు సోమవారం దొరికాయి. ఆదివారం రాత్రి వరకు 18 మంది చనిపోయారు. సోమవారం మరో ఐదుగురి మృతదేహాలు లభించాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయం దిగువన ఆదివారం భార్యాభర్తలు గల్లంతయ్యారు. భర్త యాకూబ్ (50) డెడ్​బాడీ సోమవారం నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం వద్ద దొరికింది. 

బాధిత కుటుంబాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం పరామర్శించారు. కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలం, పాల్వం మండలం మంథని, భిక్కనూరు మండలం కాచాపూర్​లో గల్లంతైన వారి డెడ్​బాడీలు సోమవారం దొరికాయి. శ్రీరాంపూర్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో వరదలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలను అధికారులు గుర్తించారు. కాగా, నాగర్​కర్నూల్ జిల్లాలో గొర్రెల కాపరి చనిపోయాడు. . 

తండ్రీ కూతుళ్లకు అంత్యక్రియలు

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమగూడెం వద్ద ఆకేర్ వాగు దాటే క్రమంలో కారుతో సహా కొట్టుకుపోయిన సైంటిస్ట్ అశ్విని (25), ఆమె తండ్రి మోతిలాల్ (60) అంత్యక్రియలు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి పరిధిలోని గంగారం తండాలో సోమవారం ముగిశాయి. అశ్విని మృతదేహం ఆదివారమే గుర్తించగా, ఆమె తండ్రి మోతిలాల్ డెడ్​బాడీ సోమవారం ఉదయం దొరికింది. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఇద్దరి మృతదేహాలను స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.