హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేసి సీబీఐకి బదిలీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నేతలు సోమవారం డీజీపీ అంజనీకుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన వారిపై కూడా సీబీఐ విచారణ చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటన కంటే ముందే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ లాక్కున్నారని అన్నారు. ఈ విషయమై కేసు నమోదు చేయాలని మొయినాబాద్ పీఎస్‌లో కంప్లైంట్ చేశామని, పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సీబీఐతో దర్యాప్తు చేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. 17న నిర్వహించనున్న దళిత గిరిజన ఆత్మగౌరవ సభలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
బాధితులపైనే కేసులు పెట్టుడేంది?
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ లీడర్లపై దాడులు పెరిగాయని రేవంత్ అన్నారు. 7వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లాలోని మార్కండేయ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడిని ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నేతలతో పాటు గిరిజనులను, దళితులను దారుణంగా తిట్టారని వివరించారు. దాడికి చేసినోళ్లపై అట్రాసిటీ కేసు పెడ్తారని అనుకుంటే.. తమ నేత నాగం జనార్ధన్రెడ్డిపైనే తప్పుడు కేసు బనాయించారని విమర్శించారు.
