రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఈసీ ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఈసీ ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్ ను పాటించరా అంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల​కోడ్​ఉండగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను 30% పెంచుతూ ఉత్తర్వులెలా ఇస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మున్సిపల్​శాఖ స్పెషల్​సీఎస్ అరవింద్​కుమార్​లను ప్రశ్నించినట్టు తెలిసింది. సీఈఓ శశాంక్​ గోయల్​నవంబర్​19న చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈసీ తాజాగా ఈ మేరకు వారికి లెటర్​ రాసింది. ఉత్తర్వులను ఒక్కరోజులోనే వెనక్కు తీసుకున్నా, స్థానిక సంస్థల్లో ఓటర్లయిన మేయర్లు, చైర్​పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు పెంపు విషయం చేరడం వారిని ప్రలోభానికి గురి చేసేలానే ఉందని ఈసీ అభిప్రాయపడినట్లు తెలిసింది.

కోడ్​ అమలులో ప్రభుత్వం సీరియస్​గా ఉండాలని సీఎస్ కు చెప్పడంతో పాటు అరవింద్ కుమార్, మున్సిపల్ సెక్రటరీ సుదర్శన్​రెడ్డిలను హెచ్చరించాలని ఆదేశించినట్టు సమాచారం. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల జీతాలు పెంచుతూ నవంబర్​18న ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం, దాన్ని మర్నాడే వెనక్కు తీసుకోవడం తెలిసిందే. 10న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతోంది. 14న ఓట్ల లెక్కింపు పూర్తయేదాకా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కోడ్​అమల్లో ఉంటుంది.