- టీఎస్ పీఎస్సీకి నిరుద్యోగులు కట్టిన ఫీజులు.. ఆరేండ్లలో 84 కోట్లు
- కమిషన్ సిబ్బంది జీతాలకు 72.45 కోట్లు చెల్లింపు
- భర్తీ చేసిన పోస్టులు 30,594
- ఆర్టీఐ దరఖాస్తులో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: టీఎస్ పీఎస్సీకి అప్లికేషన్ల ఫీజుల రూపంలో ఆరేండ్లలో రూ.84 కోట్ల ఆదాయం వచ్చింది. వివిధ నోటిషికేషన్లలో జాబ్ ల కోసం అప్లై చేసుకున్న నిరుద్యోగులు కట్టిన ఫీజుల ద్వారా ఈ మొత్తం సమకూరింది. కాగా, కమిషన్ సిబ్బంది జీతాల కోసం ప్రభుత్వం ఈ ఆరేండ్లలో రూ.72.45 కోట్లు చెల్లించింది. ఆర్టీఐ దరఖాస్తులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆర్టీఐ యాక్టివిస్టు గంగాధర కిశోర్ కుమార్ ఈ సమాచారాన్ని సేకరించారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగుల జీతాలు, నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తోంది. 2015–16లో రూ.46.84 కోట్లు కేటాయించగా, రూ.39.53 కోట్లు ఖర్చు చేశారు. 2016 –17లో రూ.29.93 కోట్లు కేటాయించగా, రూ.25.16 కోట్లు.. 2017–18లో రూ.49.89 కోట్లు కేటాయించగా, రూ.44.39 కోట్లు.. 2018–19లో రూ.51.65 కోట్లు కేటాయించగా, రూ.49.39 కోట్లు.. 2019–20లో రూ.31.16 కోట్లు కేటాయించగా, రూ.25.51 కోట్లు.. 2020–21లో రూ.34.50 కోట్లు కేటాయించగా, రూ.25 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా ఆరేండ్లలో రూ.244 కోట్లు కేటాయించగా, రూ.205 కోట్లు ఖర్చు చేశారు. ఇక కమిషన్ ద్వారా ఈ ఆరేండ్లలో 30,594 పోస్టులు భర్తీ చేశారు.
జీతాలకు నెలకు రూ.కోటి..
టీఎస్పీఎస్సీలో అన్ని స్థాయిల్లో కలిపి 115 మంది రెగ్యులర్ ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 85కు తగ్గింది. సిబ్బంది జీతాల కోసం ప్రభుత్వం నెలకు రూ.కోటి 62 వేలు చెల్లిస్తోంది. ఇక కరెంట్ బిల్లుకు నెలకు రూ.2 లక్షల పైనే కడుతోంది. ఇప్పటి వరకు కమిషన్ చైర్మన్, 9 మంది సభ్యులకు కలిపి నెలకు రూ.20.41 లక్షలు చెల్లించేవారు. అలాగే సెక్రటరీకి నెలకు రూ.2.97 లక్షలు చెల్లిస్తుండగా.. మిగతా సిబ్బందిలో ఆఫీసర్లకు రూ.17.92 లక్షలు, సెక్షన్ ఆఫీసర్లకు రూ.22.38 లక్షలు, ఏఎస్‌ఓలకు రూ.12.22 లక్షలు, జూనియర్ అసిస్టెంట్లకు రూ.1.97 లక్షలు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్‌కు రూ.7.21 లక్షలు, ఔట్ సోర్సింగ్ స్టాఫ్ కు రూ.15.50 లక్షలు చెల్లిస్తున్నారు.
అప్లికేషన్ ఫీజు తీసుకోవద్దు..
ఇక నుంచి ఏ నోటిఫికేషన్ఇచ్చినా అర్హులైన వారు ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం కల్పించాలి. త్వరలో ప్రభుత్వం ఇస్తామని చెప్తున్న 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఎలాంటి ఫీజు తీసుకోవద్దు. టీఎస్ పీఎస్సీనే కాదు.. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, గురుకుల విద్యాసంస్థల రిక్రూట్మెంట్ లోనూ ఇదే పద్ధతి పాటించాలి.
- గంగాధర కిశోర్ కుమార్, టేకులపల్లి, భద్రాద్రి కొత్తగూడెం
